H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!
H-1B సహా ఇతర వర్క్ వీసాల రెన్యూవల్స్‌పై గతంలో ఇచ్చిన ఆమోదానికి ప్రాధాన్యం ఇచ్చే నిబంధనను తొలగించాలని అమెరికా DHS ప్రతిపాదించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే పాత దరఖాస్తులనూ మొదటి నుంచి పరిశీలించే అవకాశం ఉంది. నవంబర్ 13తో ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగియనుంది. తుది నిర్ణయం వచ్చే వరకు పాత విధానమే కొనసాగుతుంది.
By: Tupaki Desk | 13 Nov 2026 10:17 PM ISTఅమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు మరో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా H-1B వీసాపై పనిచేస్తున్న వారికి సంబంధించి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీని ప్రకారం, వీసా రెన్యూవల్ సమయంలో గతంలో ఇచ్చిన ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను తొలగించాలని భావిస్తోంది.
ప్రస్తుతం ఒక ఉద్యోగి అదే కంపెనీలో, అదే హోదాలో కొనసాగుతూ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేస్తే USCIS అధికారులు గతంలో ఇచ్చిన ఆమోదానికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఉద్యోగి పరిస్థితుల్లో మార్పు వచ్చినా, గత ఆమోదంలో తప్పులు ఉన్నా మళ్లీ పరిశీలిస్తారు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే మాత్రం గతంలో వీసా ఆమోదం పొందిన ఉద్యోగుల దరఖాస్తులను కూడా అధికారులు మొదటి నుంచి పరిశీలించవచ్చు. అవసరమైతే అదనపు పత్రాలు అడగవచ్చు.
ఈ మార్పు H-1B ఉద్యోగులకే కాకుండా L-1, O-1, E, TN వంటి ఇతర వర్క్ వీసాల పొడిగింపులపైనా ప్రభావం చూపనుంది. DHS అంచనా ప్రకారం ఏడాదికి దాదాపు 2,08,429 పొడిగింపు పిటిషన్లు ఈ మార్పు పరిధిలోకి రావచ్చు.
చిన్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకూ ఈ ప్రతిపాదన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. H-1B పొడిగింపు దరఖాస్తులు చేసిన సంస్థల్లో 57 శాతం చిన్న సంస్థలేనని DHS తన విశ్లేషణలో పేర్కొంది. కొత్త విధానం వల్ల పత్రాల సమర్పణ, దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
అయితే ఈ నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. అక్టోబర్ 14న ప్రతిపాదనను విడుదల చేసిన DHS ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. నవంబర్ 13తో ఆ గడువు ముగుస్తుంది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అప్పటివరకు ప్రస్తుత రెన్యూవల్ విధానమే కొనసాగుతుంది.
అంటే, ఇప్పటికిప్పుడు H-1B వీసాదారుల రెన్యూవల్స్‌లో ఎలాంటి మార్పు లేదు. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తేనే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
