అమెరికా ఇమ్మిగ్రేషన్ సంక్షోభం: సేవల్లేవు కానీ బిలియన్ డాలర్ల ఫీజుల వసూలు!
అమెరికా కలలతో దరఖాస్తు చేసుకుంటున్న లక్షలాది మంది ఆశలపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విధానాలు నీళ్లు చల్లుతున్నాయి.
By: A.N.Kumar | 26 March 2026 3:01 PM ISTఅమెరికా కలలతో దరఖాస్తు చేసుకుంటున్న లక్షలాది మంది ఆశలపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విధానాలు నీళ్లు చల్లుతున్నాయి. వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ కాటో ఇన్‌స్టిట్యూట్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ప్రాసెస్ చేయని లేదా ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన దరఖాస్తుల ద్వారా ఏకంగా 1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లకు పైగా) పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇమ్మిగ్రేషన్ నిపుణుడు డేవిడ్ జె. బియర్ సమర్పించిన ఈ నివేదిక ఇప్పుడు అగ్రరాజ్య పాలనా యంత్రాంగంపై నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
విధాన మార్పులు.. అభ్యర్థులపై పిడుగు
గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణమయ్యాయి. అప్పటికే ఆంక్షల జాబితాలో ఉన్న 19 దేశాలకు తోడు, అదనంగా మరో 40 దేశాలపై వీసా పరిమితులు విధించారు. ఈ ఆంక్షలు కేవలం శాశ్వత వీసాలకే పరిమితం కాకుండా తాత్కాలిక వీసాలపైనా ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ముఖ్యంగా ఈ కొత్త నిబంధనల గురించి అభ్యర్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. నైజీరియా, క్యూబా, వెనిజులా, హైతీ, ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చే వేలాది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై, తమ వంతు ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ముందే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. తెలిసీ తప్పు చేస్తున్నారనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది.
స్తంభించిన వ్యవస్థ.. ఆందోళనలో విదేశీయులు
ఈ పరిమితుల ప్రభావం కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిపైనే కాకుండా ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై కూడా పడింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే మంజూరు చేసిన అనుమతులను కూడా తిరిగి సమీక్షించే కఠిన విధానం అమల్లోకి వచ్చింది. సుమారు 75 దేశాలకు సంబంధించిన ఇమ్మిగ్రెంట్ వీసాలను పూర్తిగా నిలిపివేయడంతో మొత్తం 92 దేశాల పౌరుల భవిష్యత్తు అంధకారంలో పడింది.
డీవీ లాటరీలోనూ అన్యాయమేనా?
అమెరికాలో స్థిరపడాలని కోరుకునే వారికి గొప్ప అవకాశమైన డైవర్సిటీ వీసా (డీవీ లాటరీ) విజేతలకు కూడా అన్యాయం జరుగుతోంది. లాటరీ ద్వారా ఎంపికైన వారికి వీసాల మంజూరును నిలిపివేసినప్పటికీ కొత్త దరఖాస్తుల స్వీకరణను మరియు ఫీజుల వసూళ్లను మాత్రం ప్రభుత్వం ఆపకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థ
ఏదైనా సేవకు రుసుము చెల్లించినప్పుడు దానికి తగిన ప్రతిఫలం లభించాలి. కానీ అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో "డబ్బులు కట్టండి.. ఫలితం మాత్రం గగనమే" అనే తీరు కనిపిస్తోంది. పారదర్శకత లేకపోవడం వల్ల అసలు ఎంత మొత్తం వసూలు అయిందో లెక్కలు తేల్చడం కూడా కష్టంగా మారింది. సేవలు అందించకుండా ఫీజులు వసూలు చేయడం "అనైతిక లాభార్జన" కిందకు వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన ఇమ్మిగ్రేషన్ విధానాలను సంస్కరించుకోకపోతే ప్రపంచ వేదికపై తనకున్న విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది.
