ఎఫ్-1 వీసా ఖాళీలు, సోషల్ మీడియా స్క్రీనింగ్: అమెరికా చదువులు నరకం
వీసా ఇంటర్వ్యూలో “221(g)” స్టేటస్ వచ్చినప్పుడు దానిని చాలామంది తిరస్కరణగా అపార్థం చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 10 July 2025 5:00 PM ISTఅమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే అంతర్జాతీయ విద్యార్థుల కలలు ఇప్పుడు కల్లోలంలో పడ్డాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. వీసా ఇంటర్వ్యూల తర్వాత "221(g)" అనే ఫారమ్ చేతిలో పడటంతో చాలామంది అయోమయంలో పడుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా స్క్రీనింగ్ అనే కొత్త నిబంధన వారి ఎదుట పెద్ద సవాలుగా మారింది. అమెరికా వీసా దరఖాస్తులో తమ సోషల్ మీడియా లింకులను ఎలా ఇవ్వాలో స్పష్టత లేకపోవడం గందరగోళాన్ని మరింత పెంచుతోంది.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) , స్టేట్ డిపార్ట్‌మెంట్ (DOS) ఈ వీసా ప్రక్రియను మరింత కఠినతరం చేశాయి. ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు అధికారులు మౌఖికంగా హెచ్చరికలు జారీ చేసి, వారి సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఫారాన్ని ఇచ్చి అందులో "మీ సోషల్ మీడియా లింకులు ఇవ్వకపోతే ప్రాసెసింగ్ మొదలవదు" అని స్పష్టంగా పేర్కొన్నారు.
-221(g) అంటే ఏమిటి?
వీసా ఇంటర్వ్యూలో “221(g)” స్టేటస్ వచ్చినప్పుడు దానిని చాలామంది తిరస్కరణగా అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా తిరస్కరణ కాదు. దీని అర్థం మీ దరఖాస్తు "అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్"లో ఉంది. అంటే అధికారులు మీరు ఏదైనా రిస్క్ కలిగిన వ్యక్తి అని అనుమానించినా మీ సోషల్ మీడియా పోస్ట్‌లు, మీరు షేర్ చేసిన మీమ్స్, ట్వీట్‌లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- భారతీయులకు డబుల్ షాక్
ఇది ఒక్క సమస్య మాత్రమే కాదు. భారతీయ విద్యార్థులు మరో తీవ్రమైన సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. వీసా అపాయింట్‌మెంట్లు దొరకడం లేదు. ఇప్పటికే వీసా తిరస్కరణల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది విద్యార్థులు “214(b)” కింద వీసా తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. దీని అర్థం వారు తమ స్వదేశంతో బలమైన సంబంధాలను నిరూపించలేకపోయారు అని అమెరికా అధికారులు భావించడం. ఈ నిబంధన కింద వీసా తిరస్కరించినప్పుడు, అధికారులు కారణం చెప్పాల్సిన అవసరం లేదు.
- సోషల్ మీడియా స్నేర్ మారిందా?
చాలా మంది విద్యార్థులు తమ పాత సోషల్ మీడియా పోస్టులు, ముఖ్యంగా ట్రంప్‌పై చేసిన విమర్శలను తొలగించడం ద్వారా మేలు జరుగుతుందేమో అని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి అది మరింత ప్రమాదకరం. DOS అధికారులకు పాత డేటాను ట్రాక్ చేయడం కష్టమైన విషయం కాదు. ఈ విధంగా పోస్టులు డిలీట్ చేయడం వలన మరింత అనుమానం కలిగించవచ్చు.
- ఇది హింస కాకపోతే మరేమిటి?
ఇది సాధారణ వీసా తిరస్కరణ కాదు. ఇది ఒక రకంగా హెచ్చరికనే.. అమెరికాలోకి అడుగు పెట్టే ముందు మీరు అన్ని నియమాలను అంగీకరించాలి అనే హెచ్చరిక. ఈ వీసా విధానాల్లో మార్పులు, సోషల్ మీడియా స్క్రీనింగ్ పద్ధతులు, అపాయింట్‌మెంట్ల జాప్యాలు అన్నీ కలిసి ఎఫ్-1 వీసా దరఖాస్తుదారులకు ఒక భయానక అనుభూతిని కలిగిస్తున్నాయి. చదువుకోవాలనే కలలు కల్లోలంగా మారుతున్నాయి. వీసా దరఖాస్తుదారులకు ఇది ఒక అసలైన పరీక్ష.
