అమెరికా జలపాతానికి తెలుగు పిల్లలు ఇద్దరు మృత్యువాత
సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి డెడ్ బాడీలను గుర్తించారు.వీరిలో రాకేశ్ రెడ్డిది ఖమ్మం కాగా.. రోహిత్ వివరాలు బయటకు రావాల్సి ఉంది.
By: Tupaki Desk | 12 May 2024 5:27 AM GMTమరో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు కుర్రాళ్లు అమెరికాలో మృత్యువాత పడ్డారు. ఉన్నత విద్య కోసం యూఎస్ కు వెళ్లి.. అక్కడ చదువుల్ని విజయవంతంగా పూర్తి చేసిన వారు త్వరలో తిరిగి స్వదేశానికి రావాల్సింది ఉంది. ఇలాంటివేళలో ట్రిప్ కు వెళ్లారు. అక్కడి జలపాతంలో చిక్కుకొని మరణించారు. ఎంఎస్ పూర్తి చేసి.. ఇటీవలే ఆ పట్టాల్ని అందుకున్న తెలుగు యువకులు ఇద్దరు మరణించిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఆరిజోనా వర్సిటీ నుంచి ఎంఎస్ పట్టా పొందారు 23 ఏళ్ల రాకేశ్ రెడ్డి.. 25 ఏల్ల రోహిత్ మణికంఠ. వీరిద్దరితో పాటు మరో పదహారు మంది స్నేహితులు తమ ఎంఎస్ కోర్సును విజయవంతంగా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో సరదాగా ట్రిప్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతానికి వెళ్లారు. ఉత్సాహభరిత వాతావరణంలో వారి ట్రిప్ సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఈ ఇద్దరు జలపాతంలో చిక్కుకొని కొట్టుకుపోయారు.
దీన్ని గుర్తించిన వారి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్పందించిన వారు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. రాత్రి మొత్తం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. తర్వాతి రోజు మళ్లీ వెతగ్గా.. సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి డెడ్ బాడీలను గుర్తించారు.వీరిలో రాకేశ్ రెడ్డిది ఖమ్మం కాగా.. రోహిత్ వివరాలు బయటకు రావాల్సి ఉంది.
రాకేశ్ రెడ్డి ఖమ్మం పట్టణానికి చెందిన మాంటిస్సోరి.. తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. పద్మల ఏకైక సంతానంగా పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చినప్పటికీ.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు.
ఇటీవలే ఎంఎస్ ను విజయవంతంగా పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ డే వేళ.. కొడుకు కోసం తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాకు వెళ్లారు. ఇప్పుడు తమ చేతులతో కొడుకు డెడ్ బాడీని ఊరికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రాకేశ్ రెడ్డి మరణం ఖమ్మంలోని పలువురిని కదిలించి వేసింది.