Begin typing your search above and press return to search.

ట్రంప్‌ తీరు... నాలుగు నెలల్లో ఒకే ఒక్కటి!

ప్రపంచానికి పెద్దన్న ట్యాగ్‌తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అమెరికా తన హోదాను మెల్ల మెల్లగా కోల్పోతున్నట్లు గా అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   24 April 2026 3:03 PM IST
ట్రంప్‌ తీరు... నాలుగు నెలల్లో ఒకే ఒక్కటి!
X

ప్రపంచానికి పెద్దన్న ట్యాగ్‌తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అమెరికా తన హోదాను మెల్ల మెల్లగా కోల్పోతున్నట్లు గా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మంచి చేయక పోగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా యుద్దం విషయంలో ఆయన నిర్ణయాలు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్‌లను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్‌ తో ఆయన చేసిన యుద్దం కారణంగా మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఆసియా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. అంతే కాకుండా అమెరికా సైతం లక్షల కోట్ల డాలర్ల నష్టంను భరించాల్సిన పరిస్థితి వచ్చిందని అంతర్జాతీయ మీడియా నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేవు అనేది అమెరికన్స్ మాట.

ట్రంప్‌ సంచలన నిర్ణయం...

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎంపిక అయిన తర్వాత ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వీసాల విషయంలో చాలా పెద్ద నిర్ణయాలు జరిగాయి. ట్రంప్‌ ప్రభుత్వం గోల్డ్‌ కార్డ్‌ స్కీమ్‌ ను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. స్కీమ్‌ లో భాగంగా అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారు మిలియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించడం వల్ల అమెరికాలో నివసించేందుకు గాను శాశ్వత వీసాను అమెరికన్‌ ప్రభుత్వం ఇస్తుంది. ఈ కొత్త స్కీమ్‌తో అమెరికన్‌ ప్రభుత్వంకు ఏకంగా 1.3 బిలియన్‌ల ఆధాయం వచ్చింది అంటూ గతంలో అమెరికన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అమెరికన్‌ ప్రభుత్వం గోల్డ్‌ కార్డ్‌ ను కేవలం ఒకే ఒక్కరికి ఇచ్చింది. వేలాది మంది అప్లికేషన్‌లు ఇంకా కూడా పరిశీలనలో ఉన్నాయి అంటున్నారు.

అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో...

ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబట్టినా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం ప్రభుత్వంకు సమకూరుతుంది అనే ఉద్దేశంతో సరే అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకు వచ్చిన ఆ గోల్డ్‌ కార్డ్‌ స్కీమ్‌ అమలు కాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అమెరికా వంటి దేశంలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం నాలుగు నెలలు అయినా అమలు కాకపోవడం విడ్డూరంగా ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో అమెరికా పరువు పోయినట్లు అయిందంటూ పలువురు సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా ట్రంప్‌ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ అమెరికన్‌ న్యాయ నిపుణులు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

అమెరికా గోల్డ్‌ కార్డ్‌ స్కీమ్‌...

అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్‌ లుట్నిక్ ఒక ప్రకటనలో... ఇప్పటి వరకు గోల్డ్‌ కార్డ్‌ ఒక్కరికే ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఈ స్కిమ్‌ గురించి న్యాయ నిపుణులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎదురు అయ్యే సమస్యలను గురించి వారు పరిశీలిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. వేలాది సంఖ్యలో గోల్డ్‌ కార్డ్‌ కోసం దరకాస్తు చేసుకున్న వారు ఉన్నారు. వారికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన మెల్లగా, లోతుగా సాగుతుందని లుట్నిక్ చెప్పారు. వీసాల కోసం దరఖాస్తు నిలిపి వేయడం జరిగింది. దాంతో భవిష్యత్తులో అసలు ఈ వీసా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్‌ తీరుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయమై పెద్దన్న ట్రంప్‌ ఏం అంటాడు అనేది చూడాలి.