కలల అమెరికాలో కడతేరిన జీవితం.. ఉద్యోగ వేటలో ఒత్తిడి తట్టుకోలేక తెలుగు విద్యార్థి చందు ఆత్మహత్య
తాజాగా 26 ఏళ్ల తెలుగు విద్యార్థి చందు ఆత్మహత్య ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల దయనీయ స్థితికి నిదర్శనంగా నిలిచింది.
By: A.N.Kumar | 30 April 2026 1:29 PM ISTఖండంతరాలు దాటి కన్న కలలు కల్లలవుతున్నాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల జీవితాలు మునుపెన్నడూ లేనంత సంక్షోభంలో పడ్డాయి. తాజాగా 26 ఏళ్ల తెలుగు విద్యార్థి చందు ఆత్మహత్య ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల దయనీయ స్థితికి నిదర్శనంగా నిలిచింది. ఈ విషాదకర వార్త తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం సృష్టిస్తోంది.
కలల అమెరికాలో కడతేరిన జీవితం.. చందు విషాద గాథ
ఉన్నత విద్యను అభ్యసించి, కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఆశతో చందు కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. చికాగోలోని డీపాల్ యూనివర్సిటీ లో మాస్టర్స్ పూర్తి చేసిన అతను.. గతేడాది కాలంగా ఉద్యోగ వేటలో ఉన్నాడు. చదువు పూర్తయిన తర్వాత లభించే ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) గడువు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో అతనిపై ఒత్తిడి పెరిగింది.
మరోవైపు లక్షలాది రూపాయల విద్యా రుణాలు, రోజువారీ ఖర్చులు భారం కావడంతో చందు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. వేల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. కఠినమైన వీసా నిబంధనల వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన చందు.. చివరకు ఆత్మహత్యకు పాల్పడి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.
అమెరికాలో మారుతున్న సమీకరణాలు.. భారతీయ విద్యార్థుల ఆందోళన
అమెరికాలో ఇటీవల ఏర్పడిన రాజకీయ మార్పులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమల్లోకి వస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు భారతీయ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో అమెరికా అంటే అవకాశాల గని అని భావించిన వారంతా ఇప్పుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. టెక్ రంగంలో భారీగా జరుగుతున్న లే-ఆఫ్స్ కొత్తగా చదువు పూర్తి చేసిన విద్యార్థుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, అమెరికాలో పెరిగిన జీవన ప్రమాణాలు విద్యార్థులకు భారంగా మారాయి. హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. ఓపీటీ గడువు వంటి అంశాలు విద్యార్థులను నిరంతరం భయం గుప్పెట్లోనే ఉంచుతున్నాయి.
మానసిక ఆరోగ్యమే ప్రధాన సమస్య
చందు మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు.. అది విదేశాల్లో వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు ప్రతిరూపం. కుటుంబ సభ్యుల అంచనాలు.. తీసుకున్న అప్పులు తీర్చాలనే తపన, తోటివారితో పోలికలు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చందు వంటి మృదుస్వభావి, కష్టపడి పనిచేసే వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అతని స్నేహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రస్తుతం చందు భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చికాగోలోని భారతీయ సంఘాలు తానా, నాటా వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పరిష్కారం ఎక్కడ?
ఈ హృదయ విదారక ఘటన విదేశీ విద్యపై వెళ్లే విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. విద్యార్థులకు కేవలం చదువే కాదు, వైఫల్యాలను తట్టుకునే మానసిక ధైర్యం కూడా అవసరం. ప్రభుత్వం, విద్యాసంస్థలు విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
