అమెరికాలో వరుస విషాదాలు: అనారోగ్యంతో తెలంగాణ యువకుడు, కారు ప్రమాదంలో తెలుగు చిన్నారి మృతి!
అమెరికాలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస విషాద ఘటనలు అక్కడి తెలుగు ప్రవాస సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి.
By: A.N.Kumar | 22 Jun 2026 12:44 PM ISTఅమెరికాలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస విషాద ఘటనలు అక్కడి తెలుగు ప్రవాస సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ అకాల మరణం చెందుతుండగా.. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఏడాది వయసున్న తెలుగు చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చాయి.
అనారోగ్యంతో తెలంగాణ యువకుడి అకాల మరణం
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల (26) మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లాడు. అక్కడ విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న అరుణ్, ప్రస్తుతం స్టెమ్ ఓపీటీపై ఉంటూ శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. కానీ విధి వంచించింది. కెరీర్‌లో స్థిరపడే సమయంలోనే అరుణ్ సాయి రెడ్డి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడి కన్నుమూశాడు. చేతికి వచ్చిన కొడుకు అకాల మరణం చెందాడనే వార్త వినగానే స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
స్వదేశానికి భౌతికకాయం తరలింపు
ప్రస్తుతం అరుణ్ సాయి రెడ్డి భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం భారతదేశానికి తరలించేందుకు ఆయన స్నేహితులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవసరమైన అధికారిక ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
కదులుతున్న కారు నుంచి పడి ఏడాది చిన్నారి దుర్మరణం
మరో హృదయవిదారక ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. తెలుగు మూలాలు ఉన్న దంపతుల ఏడాది వయసున్న కుమారుడు ధన్విన్ చల్లా కదులుతున్న కారులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 19 రాత్రి సౌత్ మౌంట్ వెర్నన్ అవెన్యూ – సెంటర్‌పాయింట్ డ్రైవ్ సమీపంలో ఈ ఊహించని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య సిబ్బంది స్పందించి చిన్నారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర గాయాలవల్ల లాభం లేకుండా పోయింది. వైద్యులు చిన్నారి మరణించినట్లు ప్రకటించారు.
గోఫండ్ మీ ద్వారా నిధుల సేకరణ
కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. అకస్మాత్తుగా వచ్చిపడిన ఈ విపత్తు, అంత్యక్రియల ఖర్చులను భరించేందుకు భారతీయ సమాజం తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్నారికి గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలికేందుకు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో గోఫండ్ మీ ద్వారా నిధుల సేకరణ చేపట్టారు.
అమెరికాలో వరుసగా జరుగుతున్న ఇటువంటి విషాదాలు విదేశాల్లో ఉన్న తెలుగు వారి భద్రత, ఆరోగ్యం, అత్యవసర సమయాల్లో వారికి లభించే రక్షణపై మళ్లీ చర్చను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉండే విద్యార్థులు, యువ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని, అలాగే ప్రయాణాల్లో చిన్నపిల్లల భద్రతా ప్రమాణాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
