43 ఏళ్ల అన్యాయంపై గెలిచిన భారతీయుడు.. సుబు వేదం సుదీర్ఘ పోరాటం
అమెరికా న్యాయచరిత్రలో అత్యంత సుదీర్ఘమైన.. ఉద్వేగభరితమైన పోరాటాల్లో ఒకటిగా నిలిచిన సుబు వేదం కేసులో ఎట్టకేలకు ఒక సానుకూల మలుపు చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 11 April 2026 8:15 AM ISTఅమెరికా న్యాయచరిత్రలో అత్యంత సుదీర్ఘమైన.. ఉద్వేగభరితమైన పోరాటాల్లో ఒకటిగా నిలిచిన సుబు వేదం కేసులో ఎట్టకేలకు ఒక సానుకూల మలుపు చోటుచేసుకుంది. దాదాపు 43 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి.. విడుదలైన వెంటనే డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొన్న ఈ భారత సంతతి వ్యక్తికి అమెరికా ఇమిగ్రేషన్ కోర్టు ఊరటనిచ్చింది. ఆయన అమెరికాలోనే ఉండేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
పసిప్రాయంలో అమెరికాకు.. పడుచువయస్సులో కటకటాల్లోకి..
సుబు వేదం కేవలం తొమ్మిది నెలల వయసులోనే తన తల్లిదండ్రులతో కలిసి భారత్ నుండి అమెరికాకు వెళ్లారు. అక్కడే పెరిగి పెద్దయిన ఆయనకు అమెరికా పౌరసత్వం లభించే తరుణంలో 1982లో ఒక హత్య కేసు ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. 1980లో ఆయన స్నేహితుడు, రూమ్‌మేట్ అయిన థామస్ కిన్సర్ మరణం వేదం మెడకు చుట్టుకుంది. కిన్సర్ అదృశ్యమైన తొమ్మిది నెలల తర్వాత అడవిలో బుల్లెట్ గాయాలతో శవమై కనిపించాడు. కిన్సర్‌ను చివరిసారిగా చూసింది సుబు వేదమే కావడంతో పోలీసులు ఆయనపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కానీ ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా కేవలం అనుమానంతో ఒక వ్యక్తి యవ్వనాన్ని 400 గోడల మధ్య బంధించడం న్యాయ వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోయింది.
జైలులోనే విద్యాభ్యాసం.. సంస్కరణ దిశగా అడుగులు
దశాబ్దాల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ సుబు వేదం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. జైలును ఒక శిక్షా కేంద్రంగా కాకుండా తనను తాను సంస్కరించుకునే వేదికగా మార్చుకున్నారు. అక్కడ ఉంటూనే ఉన్నత విద్యను అభ్యసించారు. తన మేనకోడళ్లకు విద్యా విషయాల్లో గైడెన్స్ ఇస్తూ కుటుంబ సభ్యులతో తన అనుబంధాన్ని కాపాడుకున్నారు. ఆయన ప్రవర్తన వ్యక్తిత్వ వికాసం పట్ల న్యాయమూర్తి సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.
విడుదలైన గంటల్లోనే మళ్ళీ అరెస్టు
2025లో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత వేదం నిర్దోషిగా తేలారు. కానీ, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న కొద్ది గంటల్లోనే ఐసీఈ ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. 1980ల కాలం నాటి ఒక పాత డ్రగ్స్ కేసును సాకుగా చూపి, ఆయనను భారతదేశానికి డిపోర్ట్ దేశ బహిష్కరణ చేయాలని ప్రయత్నించారు. తన జీవితమంతా అమెరికాలోనే గడిపిన వేదానికి, అసలు సంబంధమే లేని భారతదేశానికి పంపడం అనేది మరో మరణశిక్షలా మారింది.
ఇమిగ్రేషన్ కోర్టు తీర్పు.. కొత్త ఆశలు
ఇటీవల జరిగిన విచారణలో ఇమిగ్రేషన్ న్యాయమూర్తి వేదం పక్షాన నిలిచారు. సుమారు 43 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఆయనను దేశం దాటించడం అన్యాయమని భావించిన కోర్టు ఆయన అమెరికాలోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. అయితే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మే 4 వరకు అప్పీల్ చేసుకునే గడువు ఉండటంతో అప్పటి వరకు ఆయన ఐసీఈ కస్టడీలోనే ఉండాల్సి వస్తోంది.
న్యాయం ఆలస్యమైనా.. ఆశ చావలేదు
తన తల్లిదండ్రులు ఇప్పటికే మరణించారని, ప్రస్తుతం తన అక్క కుటుంబమే తన సర్వస్వం అని వేదం భావోద్వేగంతో వెల్లడించారు. భారతదేశంలో తనకు ఎవరూ లేరని తన మాతృభూమి అమెరికానే అని ఆయన వాదన. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు.. అమెరికా న్యాయ, ఇమిగ్రేషన్ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపుతోంది.
దశాబ్దాల పాటు చీకటి గదుల్లో గడిపిన సుబు వేదం.. తన మిగిలిన జీవితాన్ని తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. ఈ తీర్పు ఆయనకు ఆ దిశగా పెద్ద ఊరటనిచ్చింది.
