Begin typing your search above and press return to search.

అమెరికా గెంటేస్తున్న వేళ.. విదేశీ విద్యార్థులకు స్పెయిన్ శుభవార్త

అమెరికాలో ట్రంప్ పరిపాలనలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:51 AM IST
అమెరికా గెంటేస్తున్న వేళ.. విదేశీ విద్యార్థులకు స్పెయిన్ శుభవార్త
X

అమెరికాలో ట్రంప్ పరిపాలనలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాలస్తీనా అనుకూల నిరసనలు చేపట్టిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలపై "యాంటీ సెమిటిజం" ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ పన్ను మినహాయింపు హక్కులను కూడా రద్దు చేయడానికి ప్రయత్నించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో తమ విద్యను కొనసాగించలేకపోయిన విదేశీ విద్యార్థులకు స్పెయిన్ ప్రభుత్వం ఒక కొత్త, ఆకర్షణీయమైన అవకాశాన్ని కల్పించింది. స్పెయిన్ మైగ్రేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఒక ప్రకటనలో అమెరికాలో చదువు మానేసిన విదేశీ విద్యార్థులకు తమ దేశంలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది.

- స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు:

అమెరికాలో చదువు మానేసిన విద్యార్థులకు స్పెయిన్‌లోని విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు వేగవంతమైన వీసా ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. విద్యార్థి వీసా ద్వారా పార్ట్‌టైం ఉద్యోగానికి అనుమతి ఇచ్చారు. స్పెయిన్ జారీ చేసే విద్యార్థి వీసాతో విద్యార్థులు పార్ట్ టైం పని చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇది వారికి చదువుతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు నిధుల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పెయిన్ ప్రభుత్వం పరిశోధన రంగానికి అదనపు నిధులు కేటాయిస్తూ, ప్రపంచస్థాయి ప్రతిభను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

- స్పెయిన్ ఆకర్షణ కేంద్రంగా మారుతోంది

అమెరికాలో విద్య కొనసాగించలేని విద్యార్థులకు స్పెయిన్ ఒక ఆశాకిరణంగా ముందుకు వచ్చింది. వీసా నిబంధనలను సడలిస్తూ చదువుతో పాటు జీవనోపాధిని కొనసాగించే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం యూకే , ఇటలీ తర్వాత అమెరికాలో ఉన్న విద్యార్థులకు స్పెయిన్ మూడవ అత్యంత ప్రాధాన్యత గల దేశంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది విద్యార్థులు స్పెయిన్‌కు విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త విధానాల నేపథ్యంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశీ విద్య కోసం వలస వెళ్లే యువతకు ఇది ఒక మేలైన అవకాశం. అమెరికాలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో స్థిరమైన వాతావరణం, సౌకర్యవంతమైన విద్యా విధానం కోరుకునే వారికోసం స్పెయిన్ ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలవనుంది.