ఒకటి కంటే ఎక్కువ జాబ్స్.. అమెరికా స్టార్టప్‌లను మోసగించిన భారత టెకీ!
అమెరికా టెక్ పరిశ్రమలో నైతిక విలువలు, పారదర్శకతపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 4 July 2025 12:34 PM ISTఅమెరికా టెక్ పరిశ్రమలో నైతిక విలువలు, పారదర్శకతపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి కారణం భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సోహమ్ పరిక్. అతను ఒకేసారి మూడు నుంచి నాలుగు అమెరికా స్టార్టప్‌లలో పూర్తికాల ఉద్యోగిగా పనిచేస్తూ మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు. ఇండియాలో ఉంటూనే వివిధ బాధ్యతల్లో పనిచేయడం అతని నైతికతపై, ఉద్యోగ విధానాలపై తీవ్ర అనుమానాలను రేకెత్తించింది.
మోసపూరిత కార్యకలాపాలతో తొలగింపు
ప్లేగ్రౌండ్ AI వ్యవస్థాపకుడు సుహైల్ దోషీ, సోహమ్ పరిక్‌ను నియమించిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని దోషీ సామాజిక మాధ్యమం X ద్వారా వెల్లడించారు. సోహమ్ రెజ్యూమేను కూడా పబ్లిక్‌గా షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఏకంగా 13 మిలియన్ వ్యూస్‌ను సాధించి, ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
దోషీతో పాటు, లిండీ, ఫ్లీట్ AI, యాంటీమెటల్ వంటి ప్రముఖ స్టార్టప్‌లు కూడా సోహమ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాయి. అతని తెలివితేటలు, ఇంటర్వ్యూలలో చూపిన ప్రతిభతో ఆకర్షితులై ఉద్యోగం ఇచ్చినప్పటికీ, అతని మల్టిపుల్ కమిట్‌మెంట్స్ బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నకిలీ రెజ్యూమేతో మోసం
సోహమ్ తన రెజ్యూమేలో ఎంతో ప్రతిష్టాత్మకమైన AI స్టార్టప్‌లలో పనిచేసినట్లు పేర్కొన్నాడు. అయితే దోషీ ప్రకారం అది సుమారుగా "90 శాతం నకిలీ" అని తేలింది. ఇతని వంటి వ్యక్తులు విదేశాల నుంచి రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులుగా.. ఒకేసారి అనేక కంపెనీలను మోసం చేసే అవకాశం పెరుగుతోందని స్టార్టప్ వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై సోహమ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే, దోషీ ఒక ప్రైవేట్ మెసేజ్‌ను పంచుకున్నారు. అది సోహమ్ నుంచి వచ్చినదని చెబుతూ "నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశానా? నా పరిస్థితిని మెరుగుపరచడానికి ఏం చేయాలి?" అంటూ సోహమ్ విలపించినట్లుగా కనిపించింది.
ఈ నేపథ్యంలో హైపర్‌స్పెల్ అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు కానర్ బ్రెన్నన్-బర్క్ మాత్రం భిన్నంగా స్పందించారు. "రెండో అవకాశాలను నేను నమ్ముతాను" అంటూ సోహమ్‌కు ఇంజినీరింగ్ ఉద్యోగం ఇచ్చేందుకు మెయిల్ పంపించిన విషయాన్ని పబ్లిక్‌గా వెల్లడించారు.
-భారత యువతకు గుణపాఠం
ఈ సంఘటన ఇండియన్ టెకీలకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఉద్యోగ అవకాశాలను దుర్వినియోగం చేస్తూ, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో అనేక కంపెనీల్లో పనిచేయడం నైతికతను, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. డబ్బు సంపాదన ప్రధాన లక్ష్యంగా కాకుండా, విధుల్లో పారదర్శకత, సమయపాలన, నిబద్ధత ముఖ్యమని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, స్టార్టప్‌లు కూడా తమ నియామక విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. రిమోట్ వర్క్ విస్తరిస్తున్న ఈ కాలంలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ను మరింత పటిష్టం చేయాలి.
సోహమ్ పరిక్ ఘటన కేవలం అమెరికా టెక్ ప్రపంచానికి మాత్రమే కాదు, భారత టెకీలకు కూడా ఒక విజ్ఞప్తి. తెలివిని మోసం కోసం కాకుండా, నిబద్ధతతో ఉపయోగించాలి. లేదంటే, ఒక్క ట్వీట్‌తో జీవితమే తలకిందులయ్యే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.