Begin typing your search above and press return to search.

కెనడాలో శాలినీ సింగ్ హత్య కేసు: ప్రేమ బంధమే ప్రాణాన్ని తీసినదా?

కెనడాలో భారత సంతతికి చెందిన మహిళలపై హింసాత్మక ఘటనలు వరుసగా కలకలం సృష్టిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Jun 2025 10:25 AM IST
కెనడాలో శాలినీ సింగ్ హత్య కేసు: ప్రేమ బంధమే ప్రాణాన్ని తీసినదా?
X

కెనడాలో భారత సంతతికి చెందిన మహిళలపై హింసాత్మక ఘటనలు వరుసగా కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శాలిని సింగ్ అనే భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించగా, ఈ కేసులో ఆమె సహజీవన భాగస్వామిని అరెస్ట్ చేశారు.

- ల్యాండ్‌ఫిల్‌లో మృతదేహం.. డీఎన్ఏ ద్వారా గుర్తింపు

శాలినీ 2023 డిసెంబర్ 4వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. అప్పటికి ఆమె హామిల్టన్ డౌన్‌టౌన్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో తన కామన్ లా పార్ట్‌నర్ (లివిన్ బాయ్‌ఫ్రెండ్) సమిత్ స్మిత్‌తో కలిసి జీవిస్తోంది. కామన్ లా సంబంధం అంటే కనీసం 12 నెలల పాటు కలసి వివాహానుకూల సహజీవనం చేయడం అని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. శాలినీ - స్మిత్ మధ్య సంబంధం ఐదేళ్ల నుండి ఏడు సంవత్సరాల వరకు కొనసాగింది. అయితే వారి మధ్య ఎప్పుడూ పోలీసులకు ఫిర్యాదు జరగలేదని డిటెక్టివ్ సార్జెంట్ రీడ్ తెలిపారు. అయినప్పటికీ స్మిత్ పాత కేసుల్లో పోలీసులు పరిచయంతో ఉన్న వ్యక్తి అని సమాచారం.

ఒంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ నగరంలోని ఒక ల్యాండ్‌ఫిల్‌లో మే 21న మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, అవి గతేడాది డిసెంబర్ 10న కనిపించకుండా పోయిన శాలిని సింగ్‌ దేనని స్పష్టమైంది.

-లివ్ ఇన్ పార్ట్‌నర్ జెఫరీ స్మిత్‌పై హత్య కేసు

ఈ కేసులో హామిల్టన్ పోలీసులు 42 ఏళ్ల జెఫరీ స్మిత్‌ను అరెస్ట్ చేశారు. అతడే శాలిని సింగ్‌ లివ్ ఇన్ పార్ట్‌నర్. అతనిపై ద్వితీయ డిగ్రీ హత్య కేసుతో పాటు మృతదేహాన్ని దొరకకుండా చేశాడనే కేసు నమోదు చేశారు.

- హింసాత్మక ప్రవర్తనకు పాల్పడిన స్మిత్..

స్మిత్‌కు గతంలోనూ హింసాత్మక ప్రవర్తన ఉందని సమాచారం. అతను తన తల్లిని కూడా గతంలో దాడి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ శాలిని అతనికి మద్దతు ఇస్తూ గత ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా అతడితో కలిసి జీవిస్తూ వచ్చిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- ఒకరి తర్వాత మరొకరు.. భారతీయులపై దాడులు కలకలం

ఇటీవలే మరో భారతీయ విద్యార్థిని తాన్యా త్యాగి కూడా కెనడాలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఇప్పుడిలా శాలిని సింగ్ ఘటన బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయుల భద్రతపై ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

శాలిని మృతిపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారని అధికారులు వెల్లడించారు.కేసు విషాదాంతంగా మారడంతో శాలినీ కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది, మరిన్ని ఆధారాల కోసం వారు ప్రయత్నిస్తున్నారు.శాలినికి న్యాయం జరగాలని ఎన్నో భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.