Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్

అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల వాదన మరోలా ఉంది. ఈ విద్యార్థులు కొన్ని సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టికి వచ్చారని, అందుకే తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 April 2025 1:23 PM IST
US Court Reinstates SEVIS for 133 International Students
X

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కొంత ఊరట లభించింది. ట్రంప్ కార్యవర్గం హయాంలో నిలిపివేసిన 133 మంది విద్యార్థుల ఎస్‌ఈవీఐఎస్‌ (స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌)ను న్యాయస్థానం పునరుద్ధరించింది. వీరిలో అధిక సంఖ్యలో భారతీయులే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ వీరి వీసాలను రద్దు చేయడంతోపాటు ఎస్‌ఈవీఐఎస్‌ను టెర్మినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల వాదన మరోలా ఉంది. ఈ విద్యార్థులు కొన్ని సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టికి వచ్చారని, అందుకే తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. అయితే, ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదని స్పష్టమవుతోంది.

ఇమిగ్రేషన్ న్యాయవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తీవ్రమైన నేరాలు చేయకపోయినా విద్యార్థుల లీగల్ స్టేటస్‌లను తొలగించారని పేర్కొంటున్నారు. 'క్యాచ్ అండ్ రివోక్' పేరుతో నాటి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాల మేరకు విద్యార్థుల వీసా స్టేటస్‌ను సమీక్షించారు. ఇందులో ఏఐ టూల్స్, సోషల్ మీడియా పరిశీలన వంటివి ఉపయోగించారు. ఈ కార్యక్రమం కింద దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ దేశాలకు చెందినవారున్నారు.

అమెరికాలో చదువు పూర్తి చేసిన చాలామంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద అక్కడే ఉంటున్నారు. దీని ద్వారా వారికి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్టెమ్ (STEM) సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి 36 నెలల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ సమయాన్ని వారు హెచ్‌-1బీ వర్క్ వీసా వంటివాటిని పొందేందుకు వారధిగా వాడుకుంటారు. ఓపీటీ స్టేటస్ కోల్పోతే వారి అమెరికా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చాలా చిన్న కారణాలతోనే విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఏ) పేర్కొంది. ఒక కేసులో గృహహింస కేసు నమోదైందనే కారణంతో వీసా రద్దు చేశారు. తాజాగా రద్దైన 327 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే స్వల్ప రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసలు అమెరికా విదేశాంగ శాఖకు వీసాలను రద్దు చేయడానికి సరైన నిబంధనలు లేవని న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు.