Begin typing your search above and press return to search.

ఎవరీ సైకత్ చక్రవర్తి.. అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మనోడు

ఒక్క నిర్ణయంతో భారత సంతతికి చెందిన సైకత్ చక్రవర్తి ఒక్కసారిగా పాపులర్ కావటమే కాదు.. అందరూ అతడి వైపు చేసేలా చేసింది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 10:27 AM IST
ఎవరీ సైకత్ చక్రవర్తి.. అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మనోడు
X

ఒక్క నిర్ణయంతో భారత సంతతికి చెందిన సైకత్ చక్రవర్తి ఒక్కసారిగా పాపులర్ కావటమే కాదు.. అందరూ అతడి వైపు చేసేలా చేసింది. దీనికి కారణం.. తాజాగా అతడు తీసుకున్న తాజా నిర్ణయమే. అమెరికా హౌస్ స్పీకర్ పదవి కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగుతానని ప్రకటించటమే. అయితే.. ఇక్కడో ఒక మెలికి ఉంది. ఈ పదవి కోసం మాజీ స్పీకర్ గా వ్యవహరించి.. 21వ సారి కాంగ్రెస్ కు పోటీ పడుతున్న 83 ఏళ్ల నాన్సీ పెలోసీపై పోటీ చేసేందుకు డిసైడ్ కావటం సంచలనంగా మారింది. ఈ యువ రాజకీయ నేత తీసుకున్న తాజా నిర్ణయం ఒక ఎత్తు అయితే.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయటం కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలు అందరిని ఆకర్షిస్తున్నాయి.

మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కో డెమోక్రట్లకు మాంచి పట్టు ఉంది. ఇక్కడి కంగ్రెసషనల్ స్థానానికి డెమోక్రటిక్ పార్టీ తరఫున పెలోసీపై పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకురాలిగా కొనసాగుతున్న పెలోసీపై పోటీకి సిద్ధం కావటంతో అతడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2026 నవంబరులో జరిగే ఎన్నికలకు మళ్లీ ఎలెక్టు అయ్యేందుకు ఆమె ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేశారు. కాకుంటే ఈ విషయాన్ని ఓపెన్ గా వెల్లడించలేదు.

45 ఏళ్ల క్రితం రాజకీయాలలోకి వచ్చిన ఆమె.. దశాబ్దాల తరబడి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సభలో సభ్యురాలిగా ఆమెకు 2027 జనవరి వరకు గడువు ఉంది. ఇక.. పెలోసీపై పోటీకి దిగేందుకు సైకత్ సిద్ధం కావటమే కాదు.. తాజాగా ఆయనీ విషయాన్ని సోషల్ మీడియా పోస్టులోనూ షేర్ చేవారు. పెద్ద పెద్ద దాతలు ఇచ్చే విరాళాల కంటే ఓటర్లతో మమేకం అయ్యేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు ప్రాతినిధ్యం వహించే డెమోక్రటిక్ పార్టీ సైతం కొత్త తరం నేతల్ని కోరుకుంటోంది.

ట్రంప్.. ఎలాన్ మస్క్ పుణ్యమా అని అమెరికా రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లు తనను తాను మార్చుకోవాలని డెమోక్రటిక్ పార్టీ భావిస్తోంది. ఇంతకీ భారత మూలాలు ఉన్న సైకత్ చక్రవర్తి ఎక్కడి వారు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్ని చూస్తే.. 1986లో టెక్సాస్ లోని ఒక బెంగాలీ కుటుంబంలో ఇతగాడు జన్మించాడు.

హార్వర్డ్ వర్సిటీ నుంచి 2007లో కంఫ్యూటర్ సైన్స్ డిగ్రీ చేవారు. ఐటీ ఇంజనీరుగా సిలికాన్ వ్యాలీలో కొంతకాలం పని చేసిన అతను.. 2015లో సెనేటర్ బెర్నీ శాండర్స్ అధ్యక్ష ప్రచార కమిటీలో పని చేశాడు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా గతంలో పని చేసిన అతనికి ప్రత్యేక గుర్తింపుకు ఆమె విజయం కూడా ఒక కారణంగా చెప్పాలి.

ఎందుకంటే.. 2018లో కాంగ్రెస్ కు పిన్న వయసులోనే గెలిచిన మహిళగా అలెగ్జాండ్రియా ఒకాసియో కార్జెజ్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ విజయంలో సైకత్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. నాలుగు దశాబ్దాలుగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాన్సీ వయోభారంతోనూ.. ఆరోగ్య సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వేళలో.. యువ రాజకీయ నేతగా ఉన్న సైకత్ చక్రవర్తి ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించటం సంచలనంగా మారింది.

అమెరికా చరిత్రలో హౌస్ స్పీకర్ గా ఎన్నికైన తొలి మహిళగా నాన్సీ పెలోసీకి అరుదైన రికార్డు ఉంది. కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరించిన సుదీర్ఘకాలం వ్యవహరించిన ఆమె.. ఎందరో అధ్యక్షులు తీసుకొచ్చిన చట్టాలకు మద్దతు ఇవ్వటమో.. తిరస్కరించటమో చేయటం ద్వారా కీలకంగా వ్యవహరించిన ఆమెకు ఇప్పుడు పోటీగా సొంత పార్టీ నుంచే ఒక యువకెరటం తెర మీదకు రావటం.. సదరు నేత భారత సంతతికి చెందిన వాడు కావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.