రూపాయి పతనం.. విదేశాల్లో భారత స్టూడెంట్లకు కష్టకాలం
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనేది ఎంతో మంది భారతీయ యువతీ యువకుల కల.
By: A.N.Kumar | 25 May 2026 11:55 AM ISTవిదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనేది ఎంతో మంది భారతీయ యువతీ యువకుల కల. కానీ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా రూపాయి విలువ రోజురోజుకూ పతనం కావడం విదేశాల్లోని భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒకవైపు డాలర్, పౌండ్ల రూపంలో పెరుగుతున్న భారం.. మరోవైపు విదేశాల్లో చరచరా పెరిగిపోతున్న జీవన వ్యయాలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్నటివరకు కలల ప్రపంచంగా కనిపించిన విదేశీ విద్య.. నేడు బతుకుబండిని లాగడమే కష్టంగా మారిన చేదు నిజంగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులు, వారి జీవన పోరాటంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
రూపాయి పతనంతో 'డబుల్ షాక్'
అమెరికా , బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా వంటి అగ్రదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశం నుండి తల్లిదండ్రులు పంపే డబ్బు, అక్కడి కరెన్సీ మార్పిడి విలువ కారణంగా చాలా తక్కువగా మారుతోంది. ఉదాహరణకు గతంలో ఒక డాలర్ లేదా పౌండ్ కోసం చెల్లించిన రూపాయిల కంటే ఇప్పుడు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి సెమిస్టర్ ఫీజుపై అదనంగా లక్షలాది రూపాయల భారం పడుతోంది. ఎంతో ప్రణాళికతో వెళ్లిన విద్యార్థుల బడ్జెట్ అంతా తలకిందులైంది.
అదనపు లోన్ల వేటలో తల్లిదండ్రులు
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ఇళ్లు, భూములు తాకట్టు పెట్టి లేదా భారీ మొత్తంలో విద్యా రుణాలు తీసుకుని పిల్లలను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు, ఇప్పుడు పెరిగిన ఫీజుల కొరకు "టాప్-అప్ లోన్ల" కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఖర్చులు తగ్గించుకునేందుకు కఠిన త్యాగాలు
విదేశాల్లో అద్దెలు , రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఖర్చులను తట్టుకోలేక విద్యార్థులు తమ ప్రాథమిక అవసరాలను కూడా త్యాగం చేస్తున్నారు. ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా మంది విద్యార్థులు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేస్తూ కడుపు మార్చుకుంటున్నారు. మరికొందరు సూపర్‌మార్కెట్లలో కాలపరిమితి ముగిసిపోయే ముందు భారీ డిస్కౌంట్‌కు అమ్మే ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తింటున్నారు. బస్సులు, సబ్‌వే రైళ్ల టికెట్ ఖర్చులు భరించలేక, నివాసాల నుండి యూనివర్సిటీలకు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల ప్రదేశాలకు గంటల తరబడి కాలినడకన వెళ్తున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
బతుకుదెరువు కోసం 'శ్రమజీవులుగా' మారిన యువత
జీవన వ్యయం భారంగా మారడంతో కేవలం చదువుపైనే దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాల వైపు పరుగులు తీస్తున్నారు. గతంలో కాఫీ షాపులు, రెస్టారెంట్లు, మాల్స్‌లో గౌరవప్రదమైన పనులు దొరికేవి. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరగడం, ఉద్యోగాల కొరత కారణంగా దొరికిన పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైల్వే స్టేషన్లలో ఫ్లోర్లు క్లీన్ చేయడం, అర్ధరాత్రి పూట వేర్‌హౌస్‌లలో భారీ లోడ్లు ఎత్తడం, గ్యాస్ స్టేషన్లలో రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం వంటి కఠినమైన శ్రమతో కూడిన పనులకు యువత దిగుతోంది. పగలు కాలేజీ చదువులు, రాత్రంతా ఉద్యోగాలు చేయడంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది వారి విద్యా సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
నిపుణుల హెచ్చరికలు.. భవిష్యత్ ప్రణాళిక అవసరం
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం అనేది తాత్కాలికంగా కనిపించినప్పటికీ దీని ప్రభావం విదేశీ విద్యపై దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని లేదా విద్యా రుణాలపై వడ్డీ మినహాయింపు వంటి ఉపశమన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఒకప్పుడు విదేశీ చదువు అంటే సమాజంలో ఒక హోదా, ఉన్నత స్థాయికి చేరే నిచ్చెన. కానీ నేడు మారిన ఆర్థిక పరిస్థితులు దాన్ని ఒక సవాలుగా మార్చేశాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కేవలం అకడమిక్ అంశాలనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను, కరెన్సీ ఒడిదుడుకులను కూడా ముందే అంచనా వేసుకుని అడుగులు వేయడం ఎంతైనా అవసరం.
