అమెరికా సుంకాలపై భారతీయ సంతతి రచయిత కీలక వ్యాఖ్యలు
భారతీయ సంతతికి చెందిన రచయిత రామిత్ సేథి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 4 April 2025 3:23 PM ISTభారతీయ సంతతికి చెందిన రచయిత రామిత్ సేథి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అమెరికా విధించిన సుంకల వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఖరీదైన వ్యక్తులు మాత్రం అనవసరమైన పన్ను తగ్గింపులు పొందుతున్నారని ఆరోపించారు.
రామిత్ సేథి, “I Will Teach You To Be Rich” అనే పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, పొదుపు తత్వం వంటి అంశాలపై తన స్పష్టమైన దృక్కోణం ఉన్న రామిత్, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మధ్యతరగతి ప్రజలకు నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఆయన ప్రకారం ట్రంప్ ప్రభుత్వంలోని పన్నుల టాక్స్ కటింగులు ధనవంతులకే మేలు చేసాయి కాని సాధారణ ప్రజలకు ప్రయోజనం తక్కువగా ఉండిపోయిందని విమర్శించారు. “ఇది సంపద అంతరాన్ని పెంచే విధంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. రామిత్ ట్రంప్ నాయకత్వం సమయంలో అమెరికాలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయని అభిప్రాయపడ్డారు. అతని పాలనలో పరస్పర గౌరవం, సమానత్వం వంటి మౌలిక విలువలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇమ్మిగ్రేంట్స్ పట్ల ట్రంప్ తీసుకున్న కఠిన వైఖరిపై కూడా రామిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాకు తెలిసిన అనేక మేధావులు, వలసదారులు అమెరికాలో స్థిరపడి దేశానికి సేవ చేస్తున్నారు. వారిని తక్కువ చేయడం అన్యాయమని,” ఆయన వ్యాఖ్యానించారు.రామిత్ సేథి తన వ్యాఖ్యల ద్వారా నూతన తరం అమెరికన్ యువతకు ఓ స్పష్టమైన సందేశం పంపించారు: "మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటంతో పాటు, నైతిక విలువల విషయంలో కూడా స్పష్టంగా ఉండాలి. సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం మన బాధ్యత."
"మీరు ఇప్పుడు సంవత్సరానికి వేల డాలర్లు అదనంగా చెల్లించవలసి ఉంటుంది" అని సేథి అన్నారు. సాధారణ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు స్పాంజ్‌లపై సాధారణ అమెరికన్లు 34% నుండి 46% వరకు అదనంగా చెల్లిస్తున్నారని, టవల్స్‌పై 26% నుండి 29% వరకు అదనంగా చెల్లిస్తున్నారని, అలాగే పవర్ టూల్స్‌పై 32% నుండి 34% వరకు అదనంగా చెల్లిస్తున్నారని సేథి వివరించారు.
ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ సేథి మరింత ఘాటుగా స్పందించారు. "నా లాంటి సంపన్నులకు నాకు అవసరం లేని పన్ను తగ్గింపు ఇవ్వడానికే ఇదంతా" అని ఆయన అన్నారు. దీని ద్వారా ధనవంతులు మరింత లబ్ధి పొందుతుండగా.. మధ్యతరగతి , పేద ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రామిత్ సేథి చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా ఆర్థిక విధానాలపై, ముఖ్యంగా సుంకల ప్రభావంపై చర్చను రేకెత్తిస్తున్నాయి. సామాన్యుల జీవితాలపై ఈ విధానాల యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని ఆయన ఎత్తిచూపారు.
