అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!
ఈ ఎన్నికల్లో పియా దండియాకు 51.9 శాతం ఓట్లు లభించగా, కేసీ ఆస్కర్ 48.1 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.
By: Tupaki Desk | 4 Nov 2026 2:22 PM ISTఅమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో మహిళ చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి పియా దండియా.. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives)లో అడుగుపెట్టనున్నారు. నవంబర్ 3న జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి కేసీ ఆస్కర్పై ఆమె గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో పియా దండియాకు 51.9 శాతం ఓట్లు లభించగా, కేసీ ఆస్కర్ 48.1 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ విజయంతో ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి ప్రతినిధిగా పియా గుర్తింపు పొందారు. అలాగే ప్రమీలా జయపాల్ తర్వాత అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన రెండో భారతీయ సంతతి మహిళగా నిలిచారు.
పామ్ బీచ్ కౌంటీలో భారతీయ వలసదారుల కుటుంబంలో జన్మించి పెరిగిన పియా.. తొలుత ఉపాధ్యాయురాలిగా తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం న్యూయార్క్‌లోని హార్లెమ్ ప్రాంతంలో హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైట్ హౌస్ ఫెలోగా అమెరికా విద్యాశాఖలో సేవలందించడంతో పాటు యాపిల్ సంస్థలోనూ పనిచేశారు.
తన ఎన్నికల ప్రచారంలో విద్య, వైద్య సదుపాయాలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఉపాధి అవకాశాలను ప్రధాన అంశాలుగా ప్రస్తావించారు. కొత్తగా పునర్విభజించిన ఫ్లోరిడా 22వ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 జనవరిలో కొత్త కాంగ్రెస్ సమావేశమైనప్పుడు ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే.. 2026 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. డెమొక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ సాధించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి మిగిలిన రెండేళ్ల పాలనలో చట్టాల ఆమోదం, కీలక నియామకాల విషయంలో ప్రతిపక్షం నుంచి మరింత రాజకీయ సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
