Begin typing your search above and press return to search.

అమెరికాలోని ఎన్ఆర్ఐలకు భారీ ఊరట.!

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలు) ఇది నిజంగా ఒక శుభవార్త! అమెరికా సెనెట్ తాజాగా ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం.. రిమిటెన్స్ ట్రాన్స్‌ఫర్ టాక్స్‌ను గణనీయంగా తగ్గించారు

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:00 PM IST
అమెరికాలోని ఎన్ఆర్ఐలకు భారీ ఊరట.!
X

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలు) ఇది నిజంగా ఒక శుభవార్త! అమెరికా సెనెట్ తాజాగా ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం.. రిమిటెన్స్ ట్రాన్స్‌ఫర్ టాక్స్‌ను గణనీయంగా తగ్గించారు. ఇదివరకు ఉన్న 3.5 శాతం నుండి కేవలం 1 శాతానికి ఈ పన్నును తగ్గించడం ద్వారా భారతదేశానికి నిత్యం డబ్బులు పంపే ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట లభించనుంది.

ట్రంప్ బిల్‌లో కీలక మార్పులు

ఈ ముఖ్యమైన సవరణలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్” ముసాయిదాలో భాగంగా తీసుకొచ్చారు. తొలుత హౌస్‌లో 5 శాతం రేటును ప్రతిపాదించగా.. తరువాతి దశలో దానిని 3.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు సెనెట్ విడుదల చేసిన ముసాయిదాలో ఈ పన్ను రేటును ఏకంగా 1 శాతానికి తగ్గించడం విశేషం.

ఈ టాక్స్ ఎవరికి వర్తిస్తుంది?

గ్రాంట్ థార్న్టన్ భారత్‌లో యుఎస్ టాక్స్ పార్ట్‌నర్ అయిన లాయిడ్ పింటో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ టాక్స్ డబ్బు పంపకాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది. అవి ఏంటంటే..క్యాష్ ద్వారా పంపిన ట్రాన్స్‌ఫర్‌లకు అంటే, నగదు రూపంలో చేసే బదిలీలకు వర్తిస్తుంది.. మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్ లేదా ఇతర ఫిజికల్ పేమెంట్ టూల్స్ ద్వారా పంపే పంపకాలకు ఇది వర్తిస్తుంది. భౌతికంగా చేసే చెల్లింపు సాధనాల ద్వారా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది.

అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికాలోని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ఖాతాల్లో ఉన్న డబ్బుల ద్వారా జరిపే ట్రాన్స్‌ఫర్లు, లేదా అమెరికా జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ట్రాన్స్‌ఫర్లు ఈ టాక్స్‌కు లోబడి ఉండవు.

ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

ఈ కొత్త రిమిటెన్స్ టాక్స్ నిబంధనలు 2025 డిసెంబరు 31 తర్వాత అమలులోకి వస్తాయి. ఈలోగా సెనెట్ ఈ బిల్లును జూలై 4వ తేదీలోగా ఆమోదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్‌ఆర్‌ఐలకు గొప్ప ఊరట

ఈ నూతన ముసాయిదా ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతగానో ఉపశమనంగా మారనుంది. ఎందుకంటే వారు తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపేటప్పుడు బ్యాంకు ఖాతాలు లేదా కార్డులు ఉపయోగిస్తే టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా చిన్న మొత్తాలను తరచుగా పంపేవారికి.. అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారానే డబ్బు పంపడం వల్ల, ఇది వారందరికీ నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు.

ఈ బిల్లు ఆమోదంతో ప్రవాస భారతీయులు తమ కష్టార్జితాన్ని స్వదేశానికి మరింత సులభంగా.. తక్కువ పన్ను భారంతో పంపగలుగుతారు.