Begin typing your search above and press return to search.

న్యూజెర్సీలో భూకంపం.. అసలు తేడా ఇదేనట

అగ్రరాజ్యం అమెరికాలో భూకంపం చోటు చేసుకుంది. తెలుగోళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన న్యూజెర్సీలోనే తాజా భూకంపం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   6 April 2024 4:58 AM GMT
న్యూజెర్సీలో భూకంపం.. అసలు తేడా ఇదేనట
X

అగ్రరాజ్యం అమెరికాలో భూకంపం చోటు చేసుకుంది. తెలుగోళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన న్యూజెర్సీలోనే తాజా భూకంపం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటల వేళలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 4.8గా చూపిస్తోంది. అయితే.. కొందరు మాత్రం దీని తీవ్రత 5.5గా చెబుతున్నారు. తొలుత దీని తీవ్రత 5.5గా పేర్కొన్నప్పటికి.. కచ్ఛితమైన లెక్కలు చూసిన తర్వాత తీవ్రత 4.8గా ఉన్నట్లు తేల్చారు.

న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా పేర్కొంటున్నారు. అయితే.. తాజా భూకంపం చోటు చేసుకున్న ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదుగా పేర్కొంటున్నారు. ఉదయం వేళలో భూమి ఒక్కసారిగా కంపించటం.. భారీ భవనాలు ఊగటంతో ఒక్కసారి భయాందోళనలకు గురయ్యారు.

న్యూజెర్సీకి చెందిన కొందరు తెలుగు వారు ‘తుపాకీ’తో మాట్లాడారు. తమ అనుభవాన్ని వివరించారు. ఇంట్లో వంట చేసుకునే వేళలో.. ఒక్కసారిగా ఊగిపోవటంతో కళ్లు తిరిగాయని.. తనకేం జరుగుతుందో అర్థం కాలేదని పేర్కొన్నారు. మరొకరు మాట్లాడుతూ తన జీవితంలో తాను చాలానే భూకంపాలు చూశానని.. కానీ తాజా భూకంపం మాత్రం భయానికి గురి చేసేలా ఉందన్నారు. రిక్టర్ స్కేల్ మీద తీవ్రత తక్కువగా చూపినప్పటికీ.. దాని ప్రభావానికి గురైన వారు మాత్రం ఎక్కువగా ఆందోళన చెండటం గమనార్హం.

దీనికి కారణం లేకపోలేదు. భూకంపం అన్నది వచ్చే అవకాశమే లేదన్నట్లుగా ఉండే ప్రాంతంలో భూకంపం రావటం షాకిచ్చేలా మారిందంటున్నారు. ఇప్పటివరకు అందుతున్నసమాచారం ప్రకారం ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని.. కాకుంటే ఆస్తినష్టం వాటిల్లి ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఇక్కడి భారీ భవంతులన్ని పక్కాగా నిర్మించి ఉండటం కారణంగా వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదంటున్నారు.

న్యూజెర్సీ వ్యాప్తంగా భవనాలు అన్ని ఊగటం.. దగ్గర్లోని న్యూయార్క్ లోని బ్రుక్లిన్ భవనాలు సైతం కంపించినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపైభద్రతా మండలి సమావేశం జరుగుతున్న వేళలో ప్రకంపనలు రావటంతో ఈ సదస్సును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ సమయంలో మాట్లాడుతున్న సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధి జాంటీ సోరిప్టో.. ‘ఇది భూకంపమా?’ అని ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకున్న అంశాలతో పాటు.. తమ అనుభవాల్ని పలువురు పోస్టు చేస్తున్నారు.