నాసాలో ఇంటర్న్‌షిప్.. ఉన్నత శిఖరాల కల.. విధి వంచనతో అర్థాంతరంగా ముగిసిన నీలమ్ షిండే ప్రయాణం
అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. తండ్రికి అండగా నిలవాలనుకున్న ఒక భారతీయ విద్యార్థిని కలలు చిధ్రమయ్యాయి.
By: A.N.Kumar | 9 April 2026 10:38 AM ISTఅమెరికాలో ఉన్నత చదువులు చదివి.. తండ్రికి అండగా నిలవాలనుకున్న ఒక భారతీయ విద్యార్థిని కలలు చిధ్రమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన నీలమ్ షిండే అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురై సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించిన ఘటన ప్రవాస భారతీయులను.. ఆమె స్వగ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చదువులో రాణిస్తూ నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసిన ఒక మేధావి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.
ప్రమాదం.. ఆసుపత్రిలో సుదీర్ఘ పోరాటం
మహారాష్ట్రలోని సతారా జిల్లా ఉంబ్రాజ్ గ్రామానికి చెందిన నీలమ్ షిండే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ (ఇంజినీరింగ్) చివరి సంవత్సరం చదువుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున ప్రతిరోజూ లాగే ఆమె వాకింగ్‌కు వెళ్ళింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఒక వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో నీలమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం యూసీ డేవిస్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఆమెను బ్రతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ దాదాపు నెలన్నర పాటు ఆమె మృత్యువుతో పోరాడి చివరికి మార్చి 28న కన్నుమూసింది.
తండ్రి తపన.. వీసా అడ్డంకులు
నీలమ్ తండ్రి తనాజీ (69)కి ఈ వార్త పిడుగులా తగిలింది. తన కూతురిని కడసారి చూసుకోవాలని ఆమె పక్కనే ఉండి ధైర్యం చెప్పాలని ఆయన పడిన తపన వర్ణనాతీతం. అయితే వయసు రీత్యా, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆయనకు అమెరికా వీసా లభించడం కష్టతరమైంది. ఈ క్రమంలో ఎంపీ సుప్రియా సూలే జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయనకు వీసా వచ్చేలా కృషి చేశారు. వీసా రాగానే ఆయన అమెరికాకు చేరుకుని తన కూతురి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే దురదృష్టవశాత్తు వీసా గడువు ముగియడంతో ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. తాను ఇండియాలో ఉన్నా, మనసంతా అమెరికాలోని ఆసుపత్రి బెడ్ పైన ఉన్న కూతురి దగ్గరే ఉండేది.
కుటుంబంలో తీరని శోకం
తనాజీ జీవితంలో ఇది రెండో పెద్ద దెబ్బ. సరిగ్గా ఏడాది క్రితమే ఆయన తన భార్యను కోల్పోయారు. భార్య మరణం తర్వాత కూతురే సర్వస్వంగా బ్రతుకుతున్న ఆయనకు, ఇప్పుడు నీలమ్ మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. "నా కూతురు ఎంతో తెలివైనది, నాసాలో కూడా పని చేసింది. త్వరలోనే గొప్ప స్థాయికి చేరుతుందని ఆశించాను, కానీ విధి ఇంత వంచన చేస్తుందని అనుకోలేదు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతిమ వీడ్కోలు
అమెరికాలోని మౌంట్ వెర్నన్ మెమోరియల్ పార్క్‌లో నీలమ్ షిండే అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగాయి. ఆమె మేనమామ సంజయ్ కదమ్ దగ్గరుండి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టెడు దుఃఖంలో కూడా ఆ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. నీలమ్ చర్మం, కంటి కర్ణియాను దానం చేసేందుకు వారు అంగీకరించారు. తద్వారా మరణంలోనూ నీలమ్ మరొకరికి చూపును, జీవితాన్ని ప్రసాదించి మానవత్వాన్ని చాటుకుంది.
ప్రతిభావంతురాలైన విద్యార్థిని
నీలమ్ షిండే కేవలం ఒక విద్యార్థిని మాత్రమే కాదు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. పూణేలోని సింహగఢ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీఈ పూర్తి చేసిన ఆమె, తన ప్రతిభతో నాసాలో ఇంటర్న్‌షిప్ సంపాదించింది. అమెరికాలో ఎంఎస్ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కన్నది. కానీ ఒక ప్రమాదం ఆమె ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. ఆమె మృతి పట్ల అటు మహారాష్ట్రలోనూ, ఇటు అమెరికాలోని భారతీయ సమాజంలోనూ తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది.
