భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ
అమెరికాలో నేపాల్‌కు చెందిన నర్సు మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్‌ను వర్జీనియా కోర్టు దోషిగా నిర్ధారించింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేసినట్లు అంగీకరించిన నరేశ్, హత్య మాత్రం చేయలేదని వాదించాడు. మమత మృతదేహం ఇంకా లభించలేదు. వచ్చే ఏడాది మార్చి 12న శిక్ష ఖరారు కానుంది.
By: Tupaki Desk | 11 Nov 2026 4:54 PM ISTఅమెరికాలో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన నర్సు మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌ను అమెరికాలోని వర్జీనియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అత్యంత కలవరపరిచే విషయం ఏమిటంటే.. భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేసినట్లు అతనే అంగీకరించినా, ఆమెను తాను చంపలేదని చివరి వరకు వాదించాడు.
2024 జూలైలో మమత కనిపించకుండా పోయింది. ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా విధులకు రాకపోవడంతో సహోద్యోగులు ఆందోళన చెందారు. పోలీసుల విచారణలో దంపతులు నివసిస్తున్న ఇంట్లో రక్తపు మరకలు సహా పలు ఆధారాలు లభించాయి.
తాజాగా విచారణ సందర్భంగా నరేశ్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇంట్లో తన భార్య చనిపోయి ఉండటాన్ని గమనించానని, భయంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా చేసి చెత్త సంచుల్లో వేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు అంగీకరించాడు. అయితే మమత ఆత్మహత్య చేసుకుందని, తాను హత్య చేయలేదని వాదించాడు.
మరోవైపు నరేశే ఆమెను హత్య చేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. చివరకు నవంబర్ 10, 2026న జ్యూరీ అతడిని ఫస్ట్ డిగ్రీ హత్యతో పాటు మృతదేహాన్ని దాచడం, అవమానించడం వంటి అభియోగాల్లో దోషిగా తేల్చింది.
అయితే ఇంతవరకు మమత మృతదేహం లభించలేదు. ఈ దంపతుల చిన్నారి కూతురు తల్లిదండ్రులిద్దరికీ దూరమైంది. నరేశ్‌కు వచ్చే ఏడాది మార్చి 12న శిక్ష ఖరారు చేయనున్నారు.
