రష్యాలో భారతీయ విద్యార్థులపై కత్తిపోట్ల దాడి.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే?
గుర్తుతెలియని కారణంతో ఒక స్థానిక 15 ఏళ్ల రష్యన్ బాలుడు నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.
By: A.N.Kumar | 9 Feb 2026 10:59 AM ISTవిదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. రష్యాలోని ఉఫా నగరంలో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర కత్తిపోట్లు భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నింపింది. గుర్తుతెలియని కారణంతో ఒక స్థానిక 15 ఏళ్ల రష్యన్ బాలుడు నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.
అసలేం జరిగింది?
శనివారం రాత్రి విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. కేవలం 15 ఏళ్ల వయసున్న ఓ రష్యన్ బాలుడు హఠాత్తుగా విద్యార్థులపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న విద్యార్థులను గమనించిన తోటి వారు వెంటనే అప్రమత్తమై యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు.
అధికారుల స్పందన.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏంటంటే?
ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. గాయపడిన నలుగురు విద్యార్థులు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, చికిత్సకు వారు బాగా స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. భారత కాన్సుల్ అధికారి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, విద్యార్థుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాయబార కార్యాలయ అధికారులు హాస్టల్‌లోని ఇతర భారతీయ విద్యార్థులను కూడా కలిసి మాట్లాడారు. వారికి ఎటువంటి భయం అవసరం లేదని.. భద్రత విషయంలో యూనివర్సిటీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని హామీ ఇచ్చారు. "విద్యార్థులు వేగంగా కోలుకుంటున్నారు. మా అధికారులు నిరంతరం వారితో టచ్‌లో ఉన్నారు. విద్యార్థుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత." అని భారత రాయబార కార్యాలయ ప్రకటించింది.
పెరుగుతున్న ఆందోళనలు
ఈ ఆకస్మిక దాడితో ఉఫా యూనివర్సిటీలోని ఇతర దేశాల విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు మైనర్ బాలుడు కావడంతో అసలు ఈ దాడికి గల కారణాలేమిటి? ఇది జాతి వివక్షతో కూడిన దాడా? లేక వ్యక్తిగత కారణాలా? అనే కోణంలో స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్యాంపస్.. హాస్టల్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతానికి బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
