దుబాయ్‌లో విషాదం... స్కూబా డైవింగ్ చేస్తూ భారత ఇంజనీర్ మృతి
పండుగ అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం. కానీ, ఒక భారతీయ కుటుంబానికి ఈసారి పండుగ తీరని విషాదాన్ని మిగిల్చింది.
By: Tupaki Desk | 9 Jun 2025 1:00 PM ISTపండుగ అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం. కానీ, ఒక భారతీయ కుటుంబానికి ఈసారి పండుగ తీరని విషాదాన్ని మిగిల్చింది. దుబాయ్‌లో ఉంటున్న కేరళకు చెందిన యువ ఇంజనీర్ ఐజాక్ పాల్ ఒలక్కెంగిల్(29) ఈద్ అల్-అధా (Eid al-Adha) పండుగను కుటుంబంతో కలిసి చేసుకుంటున్నప్పుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్‌లోని జుమేరా బీచ్‌లో (Jumeirah Beach) స్కూబా డైవింగ్ (Scuba Diving) చేస్తూ ఆయన మరణించారు.
స్కూబా డైవింగ్ చేస్తూ గుండెపోటు
ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ఘటన శుక్రవారం జరిగింది. స్కూబా డైవింగ్ శిక్షణ కోసం నీటిలోకి వెళ్లిన ఐజాక్ పాల్‌కి అకస్మాత్తుగా గుండెపోటు (Cardiac Arrest) వచ్చింది. యుఏఈలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పాల్, అక్కడి స్కూబా డైవింగ్ ట్రైనింగ్ ప్రాంతంలో ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.
అతని మామ డేవిడ్ పియారిలోస్ చెప్పిన వివరాల ప్రకారం.. పాల్ నీటిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అక్కడే ఉన్న ఈత నిపుణులు అతన్ని నీటి నుండి బయటకు తీశారు. ఆ తర్వాత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయినా కానీ, అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. అప్పటికే పాల్ కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబంలో విషాద ఛాయలు
ఐజాక్ పాల్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన కుటుంబ సభ్యులు ఈ వార్తతో షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం, అతని మామ డేవిడ్ పియారిలోస్, ఐజాక్ పాల్ మృతదేహాన్ని స్వదేశమైన కేరళకు (Kerala) తరలించడానికి అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ, పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా ఉన్న ఐజాక్ పాల్ ఇలా అకస్మాత్తుగా మరణించడం అక్కడి ప్రవాస భారతీయులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది.