Begin typing your search above and press return to search.

నైట్ క్లబ్బుల్లో మనోడు.. హాట్ టాపిక్ గా ఎఫ్.బీ.ఐ చీఫ్ కాష్ పటేల్ యవ్వారం!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థలలో ఒకటైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వ్యవహారశైలి ప్రస్తుతం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   18 May 2025 1:46 PM IST
నైట్ క్లబ్బుల్లో మనోడు.. హాట్ టాపిక్ గా ఎఫ్.బీ.ఐ చీఫ్ కాష్ పటేల్ యవ్వారం!
X

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థలలో ఒకటైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వ్యవహారశైలి ప్రస్తుతం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారతీయ మూలాలున్న కాష్ పటేల్ ను ట్రంప్ హయాంలో ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఆయన తన కార్యాలయ విధుల కంటే నైట్ క్లబ్‌లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని, ఆయనను కలవాలంటే నైట్ క్లబ్‌లకు వెళ్లాల్సి వస్తోందని అమెరికా రాజకీయ వర్గాలలో గగ్గోలు రేగుతోంది.

- ఆరోపణలు - విమర్శలు:

ఎఫ్‌బీఐ మాజీ అధికారులు సైతం కాష్ పటేల్ ఎఫ్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌లోని హూవర్ భవనంలో కంటే నైట్‌క్లబ్‌లలో ఎక్కువగా కనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ఎఫ్‌బీఐ రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, సంస్థలో "గందరగోళం" నెలకొని ఉందని, ఎవరికీ స్పష్టత లేదని వారు విమర్శిస్తున్నారు. గతంలో ప్రతీ రోజూ ఇచ్చే ఎఫ్‌బీఐ డైరక్టర్ రోజువారీ నివేదిక ప్రకటనలు ఇప్పుడు వారానికి రెండు సార్లు మాత్రమే ఇస్తున్నారని, ఇది నాయకత్వ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అంటున్నారు.

- ఎఫ్‌బీఐ సామర్థ్యంపై ప్రభావం:

కాష్ పటేల్ ఆఫీసుకు సక్రమంగా రాకపోవడం వల్ల ఎఫ్‌బీఐ సామర్థ్యం తగ్గిపోతోందని, దర్యాప్తు ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు, పటేల్ ఎఫ్‌బీఐ ప్రైవేట్ జెట్‌లను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై యుఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

- ఏటీఎఫ్ బాధ్యతలు కూడా నిర్లక్ష్యం?

కాష్ పటేల్ కేవలం ఎఫ్‌బీఐలోనే కాకుండా, ఆయుధాలు - బాంబుల నేరాలను దర్యాప్తు చేసే, తుపాకీ సంస్కృతిని నిరోధించడానికి ఉద్దేశించిన ఏటీఎఫ్ (ATF) సంస్థకు యాక్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన ఈ బాధ్యతలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

- కాష్ పటేల్ స్పందన:

ఈ ఆరోపణలపై కాష్ పటేల్ స్పందన విచిత్రంగా ఉంది. మీడియాకు లీకులు ఇస్తున్నారని ఎఫ్‌బీఐ సిబ్బందిపై పాలిగ్రాఫ్ టెస్టులు చేయిస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, ఎఫ్‌బీఐ హెడ్‌క్వార్టర్ అయిన హూవర్ భవనం సురక్షితంగా లేదని, దాన్ని మారుస్తామని ఆయన అంటున్నట్లు సమాచారం.

మొత్తంగా, కాష్ పటేల్ వ్యవహారం ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై వస్తున్న ఆరోపణలు ఎఫ్‌బీఐ వంటి కీలక సంస్థ ప్రతిష్టను, సామర్థ్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.