Begin typing your search above and press return to search.

అమెరికా పోలీస్ కర్కశత్వానికి బలైన కర్నూలు యువతికి రూ.262 కోట్ల పరిహారం

అమెరికా గడ్డపై పోలీస్ అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి (23) కేసులో సంచలన తీర్పు వెలువడింది.

By:  A.N.Kumar   |   12 Feb 2026 4:15 PM IST
అమెరికా పోలీస్ కర్కశత్వానికి బలైన కర్నూలు యువతికి రూ.262 కోట్ల పరిహారం
X

అమెరికా గడ్డపై పోలీస్ అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి (23) కేసులో సంచలన తీర్పు వెలువడింది. మానవత్వాన్ని కించపరిచేలా వ్యవహరించిన సియాటెల్ పోలీస్ విభాగంపై సాగిన సుదీర్ఘ న్యాయపోరాటం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. జాహ్నవి మృతికి నష్టపరిహారంగా 32 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 262 కోట్లు) చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన పౌర మరణాల్లో ఇది అత్యంత భారీ పరిహారాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది.

విషాదం వెనుక అసలు కథ

2023 జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో మాస్టర్స్ చదువుతున్న కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల రోడ్డు దాటుతుండగా పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని నడుపుతున్న పోలీస్ అధికారి అత్యవసర కాల్‌కు స్పందిస్తూ గంటకు 120 కిలోమీటర్ల పైగా వేగంతో వెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రపంచాన్ని కుదిపేసిన బాడీ కామ్ వీడియో

జాహ్నవి మృతి కంటే కూడా ఆ తర్వాత బయటకు వచ్చిన పోలీస్ అధికారి డేనియల్ అడరర్ బాడీ కెమెరా దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఒక నిండు ప్రాణం పోయిందన్న బాధ లేకుండా తన సహచరుడితో మాట్లాడుతూ.. "ఆమె చనిపోయింది.. ఆమె ఒక సాధారణ వ్యక్తి. ఆమె ప్రాణానికి పెద్ద విలువ లేదు. ఒక 11 వేల డాలర్ల చెక్కు రాసి పారేస్తే సరిపోతుంది.. హహహ" అంటూ వెకిలిగా నవ్వుతూ అడరర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. భారత ప్రభుత్వం ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి అమెరికా విదేశాంగ శాఖతో చర్చలు జరిపింది. సోషల్ మీడియాలో 'జస్టిస్ ఫర్ జాహ్నవి' హ్యాష్ ట్యాగ్ అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది.

న్యాయపోరాటంలో గెలుపు

జాహ్నవి తల్లిదండ్రులు అమెరికన్ న్యాయవ్యవస్థలో రాజీలేని పోరాటం చేశారు. అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సివిల్ లా సూట్ ద్వారా సియాటెల్ సిటీని బాధ్యులను చేయడంలో వారు విజయం సాధించారు. చివరకు రూ. 262 కోట్ల భారీ పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో ఒక భారతీయ విద్యార్థి మృతికి లభించిన అత్యధిక పరిహారం ఇదే కావడం గమనార్హం.. ఈ కేసు నేపథ్యంలో సియాటెల్ పోలీస్ విభాగం తమ అత్యవసర వాహన వేగ నియంత్రణ నిబంధనలను సవరించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డేనియల్ అడరర్‌ను ఇప్పటికే విధుల నుంచి తొలగించారు.

తల్లిదండ్రుల భావోద్వేగం

"మా బిడ్డ ప్రాణం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ డబ్బు ఆమెను తిరిగి తీసుకురాలేదు. కానీ ఒక భారతీయ అమ్మాయి ప్రాణానికి విలువ లేదన్న వారికి ఇది ఒక గట్టి సమాధానం. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు " అని జాహ్నవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు నుంచి ఎన్నో కలలతో అమెరికా వెళ్ళిన ఒక సామాన్య విద్యార్థిని ప్రాణాన్ని 'తక్కువ ధర' కట్టిన వారికి, అమెరికా చట్టాలే కోట్లలో జరిమానా విధించడం ఒక చారిత్రక పరిణామం. ఇది కేవలం ఒక కుటుంబానికి దక్కిన పరిహారం మాత్రమే కాదు.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం.