ఉక్రెయిన్ లో తెలుగోడి తెగువ.. జాగ్వార్కుమార్ గర్జన.. ఇక సఫారీనే
ఇదంతా ఏపీలోని తణుకుకు చెందిన జాగ్వార్ కుమార్ గురించి. 2007లో ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిన కుమార్ అక్కడే స్థిరపడిపోయారు.
By: Tupaki Desk | 12 Aug 2023 8:14 AM GMTఓసారి యుద్ధంలో ప్రాణాలు తప్ప సర్వం కోల్పోయాడు. రూ.కోట్ల విలువైన ఆస్తులు.. రూ.లక్షల ఖరీదు చేసే కారు.. అంతకుమించి విలువైన డాక్యుమెంట్లు అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలాడు. అయినా పట్టు వీడకుండా.. ఆశ కోల్పోకుండా ప్రయత్నం చేశాడు.. పైకి లేచాడు.. మరో ఊరిని వెదుక్కుని తన తెలివినే పెట్టుబడిగా పెట్టి.. శ్రమను ఆయుధంగా చేసుకుని ఎదిగాడు. కానీ, అంతలోనే మరోసారి యుద్ధం మీద పడింది. అచ్చం అప్పటిలాగే మరోసారి రోడ్డున పడేసింది.
ఇదంతా ఏపీలోని తణుకుకు చెందిన జాగ్వార్ కుమార్ గురించి. 2007లో ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిన కుమార్ అక్కడే స్థిరపడిపోయారు. చదువు పూర్తయ్యాక.. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించింది. కొన్ని రోజుల పాటు జరిగిన యుద్ధంలో తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. అదే సమయంలో జాగ్వార్ కుమార్ అపార్ట్ మెంట్, లగ్జరీ కారు ధ్వంసమయ్యాయి. కట్టుబట్టలతో అక్కడినుంచి వచ్చేసిన జాగ్వార్ కుమార్ డాన్ బాస్ లోని స్వాతోవ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు, పొలాలు కొనుక్కోవడంతో పాటు ఆర్థికంగానూ నిలదొక్కుకున్నారు.
పులుల మీద ప్రేమతో..
జాగ్వార్ కుమార్ కు చిన్నతనం నుంచే జంతువులంటే విపరీతమైన ప్రేమ. అది ఆయనతో పాటే పెరిగి పెద్దదైంది. సినిమాలంటే కూడా అంత ఇష్టమున్న ఆయన ఇంటర్ చదువుతున్న సమయంలో హైదరాబాద్ లో ప్రయత్నాలు తీవ్రంగా సాగించారు. మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు సూచనతో మళ్లీ చదువు బాట పట్టి ఉక్రెయిన్ వెళ్లి ఎంబీబీఎస్ (ఆర్థో) పూర్తిచేశారు. ఇదే సమయంలో తన తెలివితేటలతో బిజినెస్ కూడా చేసి ఆర్థికంగా మంచి స్థితిలో నిలిచారు. చిరుత- జాగ్వార్ కలయిక అయిన పులి పిల్లను దాంతోపాటే నల్ల పులి పిల్లలను పెంచుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అంతర్జాతీయంగానూ ప్రముఖ మీడియా సంస్థలు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేయడంతో పాపులారిటీ బాగా పెరిగింది.
మళ్లీ మీద పడింది యుద్ధం..
అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఉక్రెయిన్ మీద ఏడాదిన్నర కిందట మరోసారి రష్యా దాడికి దిగింది. ఈ యుద్ధం డాన్ బాస్ కేంద్రంగా సాగడంతో జాగ్వార్ కుమార్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి మొదట యుద్ధం జాగ్వార్ కుమార్ ఉన్న ప్రాంతానికి దూరంగానే సాగింది. నాలుగు నెలల్లోపే ఆయన ఉండే గ్రామానికీ చేరింది. 2022 వేసవిలో కుమార్ ను ఓసారి రష్యా సైనికులు కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించారు. వారినుంచి ఎలాగోలా బయటపడిన ఆయన తన భూములు అమ్మి మరీ రూ.కోటితో బాంబులు పడినా చెక్కుచెదరని విధంగా పులలకు పటిష్ఠమైన డెన్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవధిలో ఉద్యోగం, ఇతర ఇబ్బందుల ఎదురైనా తట్టుకున్నారు. కానీ, రష్యా సైనికులు మరోసారి కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించారు. ఓవైపు ఉపాధి మార్గాలు దెబ్బతినడం, తాను ప్రాణాలతో ఉంటేనే మూగ జీవాలకూ రక్షణ ఉంటుందని భావించిన ఆయన ఉక్రెయిన్ వీడారు. ఆరు నెలలుగా పోలండ్ తదితర దేశాలలో పర్యటిస్తూ సరైన ఉపాధితో పాటు పులల కోసం సఫారీ (జూ పార్క్) నిర్మాణానికి విశ్వప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలో ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎట్టకేలకు 9 ఎకరాల కొనుగోలు
సఫారీ ఏర్పాటుకు జాగ్వార్ కుమార్ చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించాయి. హంగేరీ సరిహద్దులో ఉక్రెయిన్ పశ్చిమాన ఓ గ్రామంలో తొమ్మిది ఎకరాలను తాజాగా కొనుగోలు చేశారు. ఇందుకోసం తన బాండ్ లు ఇతర చరాస్తులను విక్రయించారు. తొమ్మది ఎకరాల్లో భారీఎత్తున సఫారీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పులులు, సింహాలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిగనుక సక్సెస్ అయితే జాగ్వార్ కుమార్ పేరు మార్మోగడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. దానికి కారణం ఏమటే.. ప్రస్తుతం కుమార్ ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి సమీపంలో కాదు కదా..? కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కనీస స్థాయి జూ కూడా లేదు. అలాంటిచోట కుమార్ ఏకంగా సఫారీనే నెలకొల్పుతున్నారు.
సంకల్ప బలమే నడిపించింది..
‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఒకసారి సంకల్పం తీసుకుంటే వెనక్కుతగ్గొద్దు. మన మేధాశక్తిని మించిన శక్తి మరోటి లేదు. అంతేకాదు.. శ్రమించేవారికి అంతా మంచే జరుగుతుంది. అడ్డదారులు తొక్కాలనుకునేవారు, వేరొకరికి చెడు చేయాలనుకునేవారు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు’’ అని ఉక్రెయిన్ నుంచి ‘‘తుపాకీ’’కి వివరించారు జాగ్వార్ కుమార్.