భారతీయ కార్మికులను కాపాడిన ఇజ్రాయెల్... కారణం భయానకం!
By: Tupaki Desk | 7 March 2025 2:59 PM ISTఇజ్రాయెల్ లోని నిర్మాణ రంగంలో పని చేసేందుకు వచ్చిన వారిలో 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ విడిపించింది. పని ఇస్తామని వీరికి ఆశ చూపి.. వెస్ట్ బ్యాంక్ లోని మారుమూల గ్రామానికి తీసుకెళ్లి.. నెల రోజులుగా బందీలుగా ఉంచుకున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
అవును.. పని ఇస్తామని ఆశ చూపి, వెస్ట్ బ్యాంక్ లోని మారుమూల గ్రామానికి తీసుకెళ్లి, నెల రోజులుగా బందీలుగా ఉంచుకున్న 10 మంది భారతీయులను బుధవారం రాత్రి ఇజ్రాయెల్ విడిపించింది. ఈ ఆపరేషన్ లో పాపులేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), న్యాయశాఖ పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... రక్షించినవారిని సురక్షిత ప్రాంతంలో ఉంచామని.. వారు అసలు ఎక్కడికి వచ్చారనేది గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ భారతీయులకు పని ఆశ కల్పించి కొందరు పాలస్తీనా వాసులు నెల రోజుల కిందట అల్-జాయెమ్ అనే గ్రామానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
అనంతరం.. వారి పాస్ పోర్టులను లాగేసుకున్నారని.. వాటితో ఇజ్రాయెల్ లోకి ప్రవేశించేందుకు పాలస్తీనా వాసులు ప్రయత్నించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. అయితే... బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర అనుమానంతో తనిఖీ చేయగా.. ఈ పాస్ పోర్టులు గల భారతీయ కార్మికుల వివరాలు తెల్లిశాయని.. అనంతరం వారిని రక్షించామని వెల్లడించారు.
కాగా.. హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాలస్తీనా కార్మికులకు ఇజ్రాయెల్ ప్రవేశాన్ని నిషేధించారు! దీంతో... ఇజ్రాయెల్ వెళ్లే భారతీయ కార్మికుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది సుమారు 16,000 మంది భారతీయ కార్మికులు ఇజ్రాయెల్ కు వెళ్లారు.
దీంతో... పాలస్తీన కార్మికులు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి మోసాల నుంచి భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వ సంస్థలు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నాయని అంటున్నారు.
