Begin typing your search above and press return to search.

ఘోర.. కెనడాలో ఇండియన్ స్టూడెంట్ ని కొట్టి చంపేశారు!

వాహనాన్ని దొంగిలించాలనే క్రమంలో ప్రతిఘటించిన గుర్విందర్‌ పై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు అతడికి తగిలిన గాయలను బట్టి తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   24 July 2023 9:34 AM GMT
ఘోర.. కెనడాలో ఇండియన్ స్టూడెంట్ ని కొట్టి చంపేశారు!
X

కెనడాలోని మిస్సిసాగాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటానియా - క్రెడిట్‌ వ్యూ రోడ్‌ ల సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అతని వాహనాన్ని దొంగిలించే ప్రయత్నంలో హింసాత్మకంగా మగ్ చేశారని తెలుస్తోంది.

అవును... జులై 9న మిస్సిసాగా ప్రాంతంలో తెల్లవారుజామున 2.10 గంటలకు పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్విందర్‌ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, అతడి వాహనాన్ని దొంగిలించారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. వాహనాన్ని దొంగిలించాలనే క్రమంలో ప్రతిఘటించిన గుర్విందర్‌ పై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు అతడికి తగిలిన గాయలను బట్టి తెలుస్తుంది.

ఈ సందర్భంగా అతని తల, శరీర భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన అనంతరం స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ కార్యాలయం తెలిపింది. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!

అయితే ఇది పక్కా ప్లానింగ్ తోనే జరిపిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపిన స్థానిక పోలీసు అధికారి ఫిల్‌ కింగ్... ఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు. బైక్ దొంగిలించాలనే ప్లాన్ తోనే నిందితులు పిజ్జా ఆర్డర్‌ చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఇలా పిజ్జా తీసుకొచ్చిన గుర్విందర్‌ పై దాడి అనంతరం నిందితుల్లో ఒక వ్యక్తి ఆ వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించిన పోలీసులు... దాడి జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నిందితుడు వాహనాన్ని విడిచి వెళ్లాడని చెబుతున్నారు. ప్రస్తుతం వాహనాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారట.

అయితే ఈ ఘటన అనంతరం గుర్విందర్‌ స్నేహితులు స్పందించారు. ప్రస్తుతం ఫైనల్ సెమిస్టర్‌ పరీక్షల కోసం గుర్విందర్‌ కెనడాలో ఉన్నాడని.. చదువు పూర్తి కాగానే సొంతగా పిజ్జా ఔట్‌ లెట్‌ ఓపెన్‌ చేయాలని కలలు కన్నాడని.. అంతలోనే ఇలా జరగడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ నెల 27న గురువిందర్‌ మృతదేహాన్ని భారత్‌ కు తరలించనున్నారు.

ఈ క్రమంలో గుర్విందర్‌ పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్‌ లైట్ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా... గుర్విందర్‌ మృతి ఎంతో బాధాకరం.. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.. అని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ ప్రకటించారు. గురువిందర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కాగా... పంజాబ్‌ లోని కరీంపూర్ చాహ్వాలా గ్రామానికి చెందిన ఈ గుర్విందర్.. బిజినెస్ స్టడీస్ కోసం కెనడా వెళ్లాడు. అక్కడ టొరంటోలోని లాయలిస్ట్ కళాశాలలో జాయిన్ అయ్యాడు విద్యార్థి! 24 ఏళ్ల గుర్విందర్ 2021లో కెనడా వెళ్లాడు.