Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళుతున్న వారిలో ఇండియన్సే టాప్!

విదేశాలకు వలసబాట పడుతున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నారని "వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022" వెల్లడించింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 11:30 PM GMT
విదేశాలకు వెళుతున్న వారిలో ఇండియన్సే టాప్!
X

విదేశాలకు వలసబాట పడుతున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నారని “వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022” వెల్లడించింది. ఇందులో భాగంగా... విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌... "ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌" పేరిట ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.

అవును... ప్రపంచంలో వలసలు వెళ్తున్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉందని వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 వెల్లడించింది. ఇందులో భాగంగా 2022 నాటికి 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత మెక్సికో నుంచి 1.12 కోట్ల మంది, రష్యా నుంచి 1.08 కోట్ల మంది వలస వెళ్లారు.

వీరితోపాటు చైనీయులు 1 కోటి మంది, సిరియన్లు 80 లక్షల మంది బంగ్లాదేశీయులు 74 లక్షల మందీ వలస వెళ్లిన టాప్ 10 దేశాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో... భారతీయులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. భారతీయులు యూఏఈ లో 34.71 లక్షల మంది ఉన్నారు.

ఇక రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 27లక్షలమంది, మూడో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో 25లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్‌ దేశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో వలస వెళుతున్న భారతీయుల్లో 15శాతం మంది గమ్యస్థానం.. ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వైర్డ్‌ (ఈసీఆర్‌) దేశాలే కావడం గమనార్హం. అన్‌ స్కిల్డ్‌ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం ఈ 18 ఈసీఆర్‌ దేశాలకు వెళుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇండొనేషియా, జోర్డాన్, ఇరాక్, సుడాన్, యూఏఈ, దక్షిణ సుడాన్, సిరియా, లెబనాన్, థాయిలాండ్, లిబియా, మలేషియా, యెమెన్, అఫ్గానిస్తాన్‌ లు ఉన్నాయి.