Begin typing your search above and press return to search.

తాజా యుద్ధం వేళ గల్ఫ్.. ఇజ్రాయెల్.. ఇరాన్ లో మనోళ్లు ఎందరు?

ప్రపంచంలో ఏ దేశమైనా సరే.. అక్కడ భారతీయులు కనిపిస్తారు. కష్టపడే తత్త్వం.. ఇంగ్లిషులో మాట్లాడే తీరు ఏ దేశంలో అయినా ఇట్టే ఇమిడిపోయేలా చేస్తుంది.

By:  Garuda Media   |   2 March 2026 1:23 PM IST
తాజా యుద్ధం వేళ గల్ఫ్.. ఇజ్రాయెల్.. ఇరాన్ లో మనోళ్లు ఎందరు?
X

ప్రపంచంలో ఏ దేశమైనా సరే.. అక్కడ భారతీయులు కనిపిస్తారు. కష్టపడే తత్త్వం.. ఇంగ్లిషులో మాట్లాడే తీరు ఏ దేశంలో అయినా ఇట్టే ఇమిడిపోయేలా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు 207 దేశాల్లో నివసిస్తూ ఉంటారన్నది ఒక అంచనా. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేస్తోంది. విదేశాల్లో ఉండే భారతీయుల సంఖ్య ఏకంగా 3.54 కోట్లుగా చెబుతారు. ఇందులో అమెరికాలో 56 లక్షలు.. యూఏఈలో 39 లక్షలు.. కెనడాలో31 లక్షలు.. మలేషియాలో 29 లక్షలు.. సౌదీలో 27 లక్షలకు పైనే మనోళ్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తుంటాయి. గల్ప్ దేశాలలో దాదాపు కోటి మంది (కచ్ఛితంగా చెప్పాలంటే 97 లక్షల మంది) భారతీయులు ఉపాధి పొందుతుంటారని చెప్పాలి.

తాజాగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్, యూఏఈలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన ఎక్కువగా ఉంది. ఇంతకూ ఆయా దేశాల్లో మనోళ్లు ఏం చేస్తుంటారు? ఏయే రంగాల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. యూఏఈలో భారతీయులు అన్ని రంగాల్లో కనిపిస్తారు. వారు లేని రంగం అంటూ ఉండదన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. అత్యధికంగా నిర్మాణ రంగంలో కనిపిస్తారు. ఎక్కువగా బ్లూ కాలర్ లేబర్ ఈ రంగంలో ఉంటారు. దుబాయ్ లోని ఆకాశహర్మ్యాల నిర్మాణంలో మనోళ్ల కీలకంగా వ్యవహరిస్తుంటారు. సూపర్ మార్కెట్లు.. హోటళ్లు.. డెలివరీ సర్వీసులతోపాటు టూరిజం రంగాల్లోనూ భారతీయులు ఎక్కువగా కనిపిస్తారు.

వైద్యులు.. వైద్య రంగ సర్వీసులతో పాటు.. టీచర్ల సంఖ్య కూడా ఎక్కువే. వేలాది మంది భారతీయులు ఈ రంగాల్లో పని చేస్తుంటారు. దుబాయ్ లోని బంగారు మార్కెట్లు, వస్త్ర, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారతీయ వ్యాపారవేత్తల అధిపత్యం ఎక్కువని చెబుతారు. ఇజ్రాయెల్ లో మనోళ్లు ఎక్కువగా కొన్ని రంగాల్లో కనిపిస్తారు. ఆ దేశంలోని పెద్ద వయస్కులు.. పేషెంట్ల సంరక్షణతో పాటు నర్సింగ్ సేవల్లోనూ భారతీయులు ఎక్కువగా కనిపిస్తారు. ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్దం మొదలైన తర్వత పాలస్తీనా కార్మికుల స్థానంలో దాదాపు ఆరు వేల మంది నిర్మాణ పనుల కోసం భారతీయులకు అవకాశాలు కల్పించారు. ఇజ్రాయెల్ లోని డైమండ్ ఎక్స్ఛేంజ్‌లో గుజరాత్ వ్యాపారులు ఎక్కువగా కనిపిస్తారు. ఐటీ రంగంతో పాటు.. రీసెర్చ్ లోనూ భారతీయులు కనిపిస్తారు.

ఇరాన్ విషయానికి వస్తే.. ఈ దేశంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తారు. ఇస్లామిక్ వర్సిటీలో మతపరమైన విద్యను అభ్యసించేందుకు జమ్మూకశ్మీర్ నుంచి విద్యార్థులు ఎక్కువగా వెళుతుంటారు. ఇరాన్ - భారత్ మధ్య జరిగే చమురు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని పర్యవేక్షించే రంగంలో మనోళ్లు కనిపిస్తారు. ఇరాన్ లోని కీలకమైన చాబహార్ ఓడరేవు డెవలప్ మెంట్ పనుల్లో భారతీయ ఇంజినీర్లు.. సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉంటారు.