Begin typing your search above and press return to search.

స్టోర్ లో దొంగతనం.. భారతీయురాలి అరెస్ట్.. అమెరికాలో ఇదో గుణపాఠం

అమెరికా ఇలినాయ్‌లోని మెక్‌హెన్రీ కౌంటీలో జరిగిన ఒక సంఘటన భారతీయులకు... ముఖ్యంగా అమెరికా వెళ్లే వారికి తీవ్ర హెచ్చరికగా నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 July 2025 6:35 PM IST
స్టోర్ లో దొంగతనం.. భారతీయురాలి అరెస్ట్.. అమెరికాలో ఇదో గుణపాఠం
X

అమెరికా ఇలినాయ్‌లోని మెక్‌హెన్రీ కౌంటీలో జరిగిన ఒక సంఘటన భారతీయులకు... ముఖ్యంగా అమెరికా వెళ్లే వారికి తీవ్ర హెచ్చరికగా నిలుస్తోంది. షాపింగ్ కోసం వచ్చిన ఒక మధ్యవయస్కురాలైన భారతీయ మహిళ అవ్లానీ జిమిషా.. టార్గెట్ స్టోర్‌లో సుమారు రూ. 1,08,000 ($1,300) విలువైన వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించి అరెస్టయ్యారు. ఈ ఘటన అమెరికాలో చిన్న నేరంగా భావించబడే దుకాణాల దొంగతనం ఎంత తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందో స్పష్టం చేస్తోంది.

టార్గెట్ స్టోర్ భద్రతా సిబ్బంది జిమిషాను ఏడు గంటలకు పైగా అనుమానాస్పదంగా గమనించారు. ఆమె షాపింగ్ చేస్తున్న తీరుపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరగంటలోపే ఒక మహిళా పోలీసు అధికారిణితో సహా ముగ్గురు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జిమిషాను విచారించారు.

విచారణ సమయంలో జిమిషా పదేపదే క్షమాపణలు చెబుతూ, తన వద్ద డబ్బు ఉందని, కొనుగోలు మొత్తాన్ని వెంటనే చెల్లిస్తానని వేడుకుందని స్థానిక మీడియా తెలిపింది. అయితే పోలీసులు, ముఖ్యంగా మహిళా పోలీసు అధికారిణి ఆమె మాటలకు కించిత్ కూడా సానుభూతి చూపలేదు. ఒక దశలో ఆ అధికారిణి "మీ దేశంలో కూడా ఇలా దొంగతనాలు చేస్తారా?" అని ఘాటుగా ప్రశ్నించినట్లు సమాచారం. చివరికి, జిమిషాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, చట్టపరమైన కేసు నమోదు చేశారు.

- ఒక్క దొంగతనమే... జీవితకాల నింద

అమెరికాలో దుకాణాల దొంగతనాన్ని కేవలం చిన్న పొరపాటుగా చూడరు. ఇది ఒక తీవ్రమైన నేరం. ఈ నేరం నమోదైన తర్వాత అది జీవితాంతం మీపై మచ్చగా మిగిలిపోతుంది. మీరు క్షమించమని అడిగినా, డబ్బు చెల్లిస్తానని చెప్పినా అది చట్టపరమైన ప్రక్రియను ఆపదు.

- ఈ సంఘటన నుంచి భారతీయులు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు:

నేర రికార్డులు భవిష్యత్తులో వీసా పొందడంలో లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను కొనసాగించడంలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తాయి. మీ పాస్‌పోర్ట్‌పై నేర చరిత్ర నమోదు కావచ్చు, ఇది అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం చూపుతుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా తీవ్ర అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఒక్కరి చర్య దేశానికి కూడా అప్రతిష్టను తీసుకువస్తుంది.

- భారతీయులకు హెచ్చరిక:

అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలను గౌరవించడం అత్యవసరం. చిన్న తప్పిదంగా కనిపించేది కూడా అక్కడ తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. నిజాయితీగా జీవించడమే గౌరవప్రదం, అవమానాన్ని కొనితెచ్చుకోవడం కాదు.