'గారె'ల వాసనకు పడిపోయారు.. ఇండియన్ అతిథి మర్యాదకు నెటిజన్ల ప్రశంసలు!
మనకు నోరూరించే వంట వాసన తగిలినా, అది చూసినా "ఎవరో భలే వండుతున్నారు గురూ!" అనిపిస్తుంది కదా.
By: Tupaki Desk | 7 Jun 2025 8:00 AM ISTమనకు నోరూరించే వంట వాసన తగిలినా, అది చూసినా "ఎవరో భలే వండుతున్నారు గురూ!" అనిపిస్తుంది కదా. అమెరికాలో ఇద్దరు వ్యక్తులకు కూడా అలాంటి అనుభూతే కలిగింది. అయితే, వారు ఏం వండుతున్నారో తెలియదు. ఆకలిగా ఉందో, లేక ఆ తెలియని వంట వాసనపై ఆసక్తి కలిగిందో తెలీదు కానీ, ఆ వాసనను పట్టుకుని వెళ్లారు. ఒక భారతీయ మహిళ ఇంటి తలుపు తట్టారు. "మీ ఇంట్లో చాలా మంచి వాసన వస్తోంది. ఏం వండుతున్నారు?" అని అడిగారు.
ఆమె "గారెలు" వండుతున్నానని చెప్పడం ఆశ్చర్యం కాదు కానీ, ఆ తర్వాత జరిగినదే వైరల్ అయ్యింది. ఆ మహిళ వెంటనే "ఇదిగోండి.. మీరు రెండు గారెలు తినండి" అంటూ వాటిని పళ్ళాల్లో పెట్టి, కొబ్బరి పచ్చడితో సహా వారికి వడ్డించింది. ఈ సంఘటన ఇంటర్నెట్‌లో ఎంతగానో వైరల్ అవుతోంది. ఈ సంఘటన పది రోజుల క్రితం అమెరికాలోని మిన్నెసోటాలో జరిగింది. పేవ్‌మెంట్‌లను శుభ్రం చేస్తున్న ఇద్దరు అమెరికన్లు భారతీయ వంటకం (గారెల) వాసనకు పడిపోయి, ఆ ఇంటికి వెళ్లిన దృశ్యాన్ని స్వయంగా ఆ కంపెనీయే వీడియో తీసి 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ వైరల్ వీడియో కేవలం పది రోజుల్లోనే కోటి (10 మిలియన్) కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా "అంటే ఇది ఇండియన్ అంటే!", "అతిథి మర్యాదకు రియల్ ఎక్జాంపుల్" అంటూ భారతీయ సంస్కృతిని, ఆతిథ్యాన్ని వివిధ రకాలుగా ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. వారు చెప్పినట్లు "వినాలంటే భారతం వినాలి, తింతే గారెలు తినాలి!!" అనిపించేలా ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా భారత సంస్కృతికి మంచి గుర్తింపు తెచ్చింది.