Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది కఠిన సవాళ్లు

అమెరికా డ్రీమ్.. ఈ మాట ఎంతో మందికి ఒక ఆకర్షణీయమైన కల. అయితే 2025 నాటికి భారతీయ విద్యార్థులకు ఇది ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణంగా మారుతోంది.

By:  Tupaki Desk   |   29 July 2025 6:00 AM IST
అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది కఠిన సవాళ్లు
X

అమెరికా డ్రీమ్.. ఈ మాట ఎంతో మందికి ఒక ఆకర్షణీయమైన కల. అయితే 2025 నాటికి భారతీయ విద్యార్థులకు ఇది ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణంగా మారుతోంది. ప్రస్తుతం F-1 వీసాపై చదువుతున్న వారు.. ఓపీటీ (Optional Practical Training) మీద పనిచేస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని 50 రాష్ట్రాలలో అనిశ్చితి, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి, వీసా ఉల్లంఘన భయాలతో పెనుగులాడుతున్నారు.

- టాప్ రాష్ట్రాలు: అవకాశాలున్నా, భారం ఎక్కువ!

అమెరికాలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు గతంలో భారతీయ విద్యార్థులకు ఆశాకిరణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు, ఇక్కడ అవకాశాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. క్యాలిఫోర్నియా (సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్) టెక్ ఉద్యోగాలకు కేంద్రమైనా, ఇక్కడ జీవన వ్యయం ఊహించని విధంగా ఉంది. అధిక అద్దెల కారణంగా ఐదారుగురు విద్యార్థులు ఒకే ఇంట్లో కలిసి జీవించాల్సిన పరిస్థితి. ఐటీ రంగంలో OPT విద్యార్థులు 3-5 నెలల పాటు ఉద్యోగాలు లేకుండా ఎదురుచూడాల్సి వస్తోంది. న్యూయార్క్ (న్యూయార్క్ సిటీ, బఫెలో) ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాలలో ఉన్న విద్యార్థులు తక్కువ జీతాలు, విపరీతమైన అద్దెలతో అల్లాడుతున్నారు. చాలా చోట్ల వేతనం లేని ఇంటర్న్‌షిప్‌లు ఒక ట్రెండ్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్ (డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్)లు ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా ఉన్నప్పటికీ, ఇక్కడ కాంట్రాక్టర్లు నెట్ 60/నెట్ 90 పే టర్మ్స్‌తో (60/90 రోజుల తర్వాత చెల్లింపు) జీతాలను ఆలస్యం చేస్తున్నారు. కొందరికి నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూజెర్సీ భారతీయ కన్సల్టెన్సీలకు పెద్ద హబ్‌గా ఉన్న ఈ రాష్ట్రంలో, F-1 హోల్డర్లు వీసా స్పాన్సర్‌షిప్‌లో ఆలస్యం, తక్కువ జీతాలతో భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఇల్లినాయిస్ (చికాగో)లో ఇంజినీరింగ్, స్టెమ్ విద్యార్థులకు ఇక్కడ తీవ్ర పోటీ ఎదురవుతోంది. పెరిగిన అద్దెలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో కొత్తగా వచ్చిన విద్యార్థులు మనోస్థైర్యం కోల్పోతున్నారు.

మిడ్‌వెస్ట్ & సౌత్ రాష్ట్రాల్లో తక్కువ అద్దె, తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఒహాయో, ఇండియానా, జార్జియా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో జీవన వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ, ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితం. చాలా మంది విద్యార్థులు 3-6 నెలల్లోనే పెద్ద నగరాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్లోరిడాలో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ రంగాలలో ఇక్కడ ఎక్కువగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. టెక్ విద్యార్థులకు తక్కువ జీతాలు లేదా ఒప్పందం లేకుండా పనిచేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.

పశ్చిమ & మౌంటైన్ రాష్ట్రాల్లో కొత్త అవకాశాలు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అరిజోనా, ఉటా, కొలరాడో లాంటి రాష్ట్రాల్లో ఖర్చు తక్కువ, కానీ ఉద్యోగాలు పరిమితం. సరైన పరిచయాలు లేకపోవడంతో ఓపీటీ హోల్డర్లకు రిక్రూటర్లతో కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతోంది. నెవాడా, న్యూ మెక్సికోలలో ఇక్కడ చాలా తక్కువ ఉద్యోగ అవకాశాలున్నాయి. హెల్త్ ఐటీ వంటి నిశ్చిత రంగాల్లో మాత్రమే కొంత స్థిరత్వం కనిపిస్తోంది.

ఉత్తర రాష్ట్రాలు మిన్నెసోటా, విస్కాన్సిన్, నార్త్ డకోటా, సౌత్ డకోటాలో తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన శీతాకాలం, ఒంటరితనం కారణంగా చాలామంది విద్యార్థులు డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి రిమోట్ రూపంలో వస్తున్నాయి. వీసా స్పాన్సర్ చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి.

- ఆర్థిక వాస్తవాలు.. కష్టం కష్టమే!

భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అద్దె లోన్ లు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అద్దెలు $800-$1,200 వరకు వెళ్తుండటంతో, భారతదేశంలో 11-14% వడ్డీతో తీసుకున్న విద్యా రుణాల ఒత్తిడి వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా కంపెనీలు 'క్లయింట్ జీతం ఇవ్వలేదు' అని సాకు చెప్పి ఓపీటీ ఉద్యోగులకు పాక్షిక చెల్లింపులు మాత్రమే ఇస్తున్నాయి. భారతీయ కన్సల్టెన్సీల దుర్వినియోగం నడుస్తోంది. కొన్ని డెసీ ఫిర్మ్స్ (భారతీయ సంస్థలు) విద్యార్థులను భారతదేశంలో డబ్బు తీసుకోమని ప్రలోభపెట్టి, అమెరికా పన్ను , వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి.

- స్కిల్స్ Vs మార్కెట్ డిమాండ్

మారుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలు లేకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. డిమాండ్ ఉన్న రంగాలైన డేటా సైన్స్, డెవాప్స్, AI రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు ఉన్నప్పటికీ, వారికి ప్రాక్టికల్ అనుభవం ఉండాలి. డిమాండ్ తగ్గిన రంగాలైన పబ్లిక్ హెల్త్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంఐఎస్ వంటి కోర్సులు చేసిన విద్యార్థులు మార్కెట్‌లో తగ్గిన డిమాండ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అనధికారిక ఉద్యోగాలు AI ఆధారిత రెజ్యూమే ఫిల్టర్‌లు, హైరింగ్ ఫ్రీజ్ వల్ల కొందరు అధికారికంగా లేని ఉద్యోగాల్లోకి వెళ్తూ వీసా ఉల్లంఘనకు గురవుతున్నారు.

కొంత భద్రత ఎక్కడ ఉంది?

ఈ సవాళ్ల మధ్య కూడా కొన్ని నగరాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆస్టిన్ (టెక్సాస్), రాలీ (నార్త్ కరోలినా), సియాటెల్ (వాషింగ్టన్), అట్లాంటా (జార్జియా) వంటి నగరాలు ఇంకా నియామకాలు చేస్తున్నాయి. లింక్డ్ ఇన్ , ప్రెసెన్స్ ఇంటర్న్‌షిప్ అనుభవం, బూట్‌క్యాంప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అల్యూమ్నీ గ్రూపులు, టెలిగ్రాం /వాట్సాప్ గ్రూపులు, జాబ్ ఫెయిర్‌ల ద్వారా నెట్‌వర్కింగ్ చేసుకోవడం కొంతమందికి సహాయం చేస్తోంది.

- మానసిక ఒత్తిడి: ఆపడానికి సమయం!

వీసాను నిర్వహించాలన్న ఒత్తిడి, కుటుంబ ఆశలు, విద్యా రుణాలు తీర్చాలి, H-1B రావాలి అన్న భయాలు భారతీయ విద్యార్థులలో ఆందోళన, డిప్రెషన్‌కు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఇప్పుడు కెనడా, జర్మనీ, యూకే వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు.

"అమెరికా" ఇకపై గ్యారంటీ అయిన భవిష్యత్ గమ్యం కాదు. ఇది ఇప్పుడు నైపుణ్యాలు, వ్యూహం, మనుగడ ఆటగా మారింది. ఒక జీపీఏ (GPA) సరిపోదు. వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, బలమైన కనెక్షన్‌లు , మానసిక స్థైర్యం విజయం సాధించడానికి అత్యవసరం.