చేయి తెగేదాకా.. ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై కత్తి దారుణం
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. ఇటీవల చోటుచేసుకున్న రెండు దారుణమైన ఘటనలు భారత్‌తో సహా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 27 July 2025 3:42 PM ISTఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. ఇటీవల చోటుచేసుకున్న రెండు దారుణమైన ఘటనలు భారత్‌తో సహా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మెల్‌బోర్న్ నగరంలో భారతీయ విద్యార్థి సౌరభ్ ఆనంద్‌పై జరిగిన కత్తి దాడి, ఈ భయాందోళనను మరింత పెంచింది.
ఘోర దాడి.. చేయి తెగిన సౌరభ్
వివరాల్లోకి వెళితే… ఆల్టోనా మెడోస్ ప్రాంతంలో నివసిస్తున్న సౌరభ్ ఆనంద్ ఇటీవల ఒక ఫార్మసీ నుంచి మందులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఐదుగురు యువకులు ఆకస్మికంగా అతడిపై దాడికి పాల్పడ్డారు. వారు అతని మెడను కోయడానికి ప్రయత్నించగా, సౌరభ్ ధైర్యంగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో కత్తి అతడి చేతిని తీవ్రంగా గాయపరిచింది. అంతేకాకుండా శరీరంపై పలు చోట్ల కత్తితో గాయాలు చేశారు. ఈ దాడిలో అతడి చేయి తెగిపోవడం గమనార్హం, ఇది దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. సౌరభ్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేసి తెగిపోయిన చేయిని తిరిగి అతికించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐదవ నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు సమాచారం.
చరణ్‌ప్రీత్‌పై దాడి ఘటన మరువకముందే...
సౌరభ్ పై దాడి జరగడానికి కొద్ది రోజుల ముందే, మరో భారతీయ విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌పై కూడా మెల్‌బోర్న్‌లోనే దుండగులు దాడికి పాల్పడ్డారు. పదునైన వస్తువులతో అతనిపై దాడి చేసి, జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో చరణ్ ముఖానికి, వెనక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
ఆసియన్లు లక్ష్యంగా మారతున్నారా?
ఇలాంటి వరుస దాడులు చూస్తుంటే, ఆసియన్లు ముఖ్యంగా భారతీయులు లక్ష్యంగా మారుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు తమ భద్రతకు భరోసా కోరుకుంటారు. కానీ ఇలా ప్రాణాలకు ప్రమాదం ఎదురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జాత్యహంకార దాడులు ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని భారతీయ సమాజం బలంగా అభిప్రాయపడుతోంది.
భారత ప్రభుత్వ స్పందన ఏంటి?
ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా కీలక అంశంగా మారింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ విషయంలో తీవ్ర స్థాయిలో చర్చలు జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంటున్న వరుస దాడులు, జాత్యహంకార వ్యవహారాలు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై పెరుగుతున్న సవాళ్లను స్పష్టంగా చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు.
