ఇద్దరు ఇండియన్స్ అరెస్ట్... విద్యార్థి వీసాపై యూఎస్ వెళ్లి ఇదేం పని?
విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చిన ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 30 April 2025 1:10 PM ISTవిద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చిన ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఇద్దరు యువకులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతుండటంతో వారిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
అవును... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లి అక్కడ వృద్ధులను బెదిరుస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను మహ్మదిల్హామ్ వహోరా, హజియాలి వహోరాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరి వయసు 24 ఏళ్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరూ చికాగోలోని ఈస్ట్-వెస్ట్ యూనివర్శిటీలో చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయాలపై స్పందించిన అధికారులు... అక్టోబర్ 2024న ఓ వృద్ధుడు తనకు స్కామర్ల నుంచి ఫోన్ వచ్చిందని పోలీసులను ఆశ్రయించాడని.. స్కామర్లు తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఓ కేసు విషయంలో డబ్బులు ఇవ్వాలని బెదిరించారని.. దీంతో, క్రిప్టోకరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికి ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు తాజాగా నింధితులను అదుపులోకి తీసుకుని విచారించగా... గతంలోనూ వీరు ఇదే విధంగా పలువురు వృద్ధులను మోసం చేసినట్లు తేలిందని అంటున్నారు. ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
