అమెరికాలో భారతీయ విద్యార్థి ఘాతుకం: తల్లి, చిన్నారిపై అమానుష దాడి.. నిందితుడి అరెస్టు
అమెరికాలో మరోసారి ఒక భారతీయ విద్యార్థి ప్రవర్తన సంచలనం సృష్టించడమే కాకుండా ప్రవాస భారతీయుల ప్రతిష్టను మసకబార్చేలా చేసింది.
By: A.N.Kumar | 27 April 2026 12:33 PM ISTఅమెరికాలో మరోసారి ఒక భారతీయ విద్యార్థి ప్రవర్తన సంచలనం సృష్టించడమే కాకుండా ప్రవాస భారతీయుల ప్రతిష్టను మసకబార్చేలా చేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఒక తల్లి, ఆమె మూడేళ్ల పసికందుపై అతి కిరాతకంగా దాడి చేసిన కేసులో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి అతర్వ వయాస్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పార్కులో నరరూప రాక్షసుడి ప్రతాపం
పోలీసు రికార్డుల ప్రకారం.. ఈ అమానుష ఘటన ఏప్రిల్ 18న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఒక బహిరంగ పార్కులో చోటుచేసుకుంది. బాధితురాలు గాబ్రియెల్లా పెరెజ్ తన మూడేళ్ల చిన్నారితో కలిసి ప్రశాంతంగా పార్కులో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న అతర్వ వయాస్.. ఎటువంటి కారణం లేకుండా ఆకస్మికంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. వయాస్ మొదట పెరెజ్ జుట్టు పట్టుకుని ఆమెను బలవంతంగా నేలపైకి లాగాడు. ఆ సమయంలో ఆమె ఎత్తుకున్న చిన్నారి ప్రమాదకరంగా కింద పడిపోయింది. నేలపై పడి రోదిస్తున్న చిన్నారిని కూడా వదలని వయాస్, ఆ పసికందుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. నిందితుడు ఆ చిన్నారిని కొరకడంతో శరీరంపై పంటి గాయాలు ఏర్పడ్డాయి. దాడి ధాటికి చిన్నారికి చెందిన రెండు పళ్లు ఊడిపోయాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నేర చరిత్ర.. వీసా ఉల్లంఘనలు
నిందితుడు వయాస్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను అమెరికాలో చట్టబద్ధంగా ఉండటం లేదని, అతనిపై ఇదివరకే నేర చరిత్ర ఉందని అధికారులు గుర్తించారు. ఆగస్టు 2023లో స్టూడెంట్ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వయాస్.. నిబంధనలు ఉల్లంఘించడంతో కేవలం మూడు నెలల్లోనే అతని వీసా రద్దయింది. నవంబర్ 2023లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ క్యాంపస్‌లో జరిగిన ఒక దాడి కేసులో ఇతను అరెస్టయ్యాడు. అప్పట్లో ఇతనిపై 'ఫెలనీ అసాల్ట్' కేసులు నమోదయ్యాయి. గతంలోనే అరెస్ట్ అయినప్పటికీ, అప్పటి యంత్రాంగం ఇతనిని దేశం నుంచి బహిష్కరించకుండా వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ విధానాల ప్రభావం.. కఠిన చర్యలు
ప్రస్తుతం అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వలస విధానాలు అత్యంత కఠినంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేరాలకు పాల్పడే విదేశీయుల పట్ల 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వయాస్ కేసును ఐసీఈ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. అతర్వ వయాస్‌పై ప్రస్తుతం డిటైనర్ జారీ చేశాం. స్థానిక కోర్టులో విచారణ ముగియగానే, ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని వెంటనే భారతదేశానికి డిపోర్ట్ చేస్తాం. అని తెలిపారు.
ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులలో ఆందోళన కలిగించడమే కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికి వచ్చే చెడ్డ పేరుపై చర్చకు దారితీసింది. విదేశీ గడ్డపై ఉన్నప్పుడు అక్కడి చట్టాలను గౌరవించకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
