Begin typing your search above and press return to search.

జార్జ్ ఫ్లాయిడ్ లాగానే.. ఆస్ట్రేలియాలో పోలీసుల క్రూరత్వం: భారత సంతతి వ్యక్తి మృతి

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించడం వల్ల భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (42) అనే వ్యక్తి మృతి చెందారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 10:05 AM IST
జార్జ్ ఫ్లాయిడ్ లాగానే.. ఆస్ట్రేలియాలో పోలీసుల క్రూరత్వం: భారత సంతతి వ్యక్తి మృతి
X

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించడం వల్ల భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (42) అనే వ్యక్తి మృతి చెందారు. ఇటీవల గౌరవ్ కుండి, అమృతపాల్ కౌర్ దంపతుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీనిని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు గృహహింసగా భావించి గౌరవ్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అయితే, తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, కేవలం చిన్నపాటి వాగ్వాదమేనని అమృతపాల్ పదే పదే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించలేదని, బలవంతంగా అతడిని నేలపై పడేసి అరెస్టు చేయడానికి ప్రయత్నించారని అమృతపాల్ తెలిపారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి గౌరవ్ మెడను మోకాలితో గట్టిగా అదిమిపట్టారని, అరెస్టు సమయంలో గౌరవ్ తల నేలకు, పోలీసు వాహనానికి బలంగా తగలడంతో అక్కడే స్పృహ కోల్పోయాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనను అమృతపాల్ తన కెమెరాలో చిత్రీకరించడం ద్వారా పోలీసుల క్రూరత్వం బయటపడింది.

స్పృహ కోల్పోయిన గౌరవ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. చికిత్స పొందుతూ గౌరవ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ సంఘటన 2020లో అమెరికాలో జరిగిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తుచేస్తోందని స్థానిక మీడియా పేర్కొంది. అడిలైడ్ పోలీసులు తమ భర్త మృతికి కారణమయ్యారని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని అమృతపాల్ కౌర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో భారత కమ్యూనిటీలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.