అమెరికాలో మరో రెండు టాప్ కంపెనీలకు సీఈవోలుగా ఇండియన్స్
అమెరికాలోని రెండు దిగ్గజ సంస్థలకు భారతీయ మూలాలున్న ఇద్దరు ప్రముఖులు సీఈవోలుగా నియమితులయ్యారు.
By: A.N.Kumar | 24 Sept 2025 4:00 PM ISTఅమెరికాలోని రెండు దిగ్గజ సంస్థలకు భారతీయ మూలాలున్న ఇద్దరు ప్రముఖులు సీఈవోలుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు విదేశీ మూలాలున్న వ్యక్తులపై రాజకీయ చర్చలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో జరగడం విశేషం.
టీ-మొబైల్ సీఈవోగా శ్రీనివాస్ గోపాలన్
ప్రముఖ అమెరికన్ టెలికాం దిగ్గజం టీ-మొబైల్ కు కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన శ్రీనివాస్ గోపాలన్ (స్రినీ) బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 1 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఈవో మైక్ సీవర్ట్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. సీవర్ట్ ఇప్పుడు కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసిన "వైస్-చైర్మన్" పదవిలో ఉంటారు.
ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన గోపాలన్ తన కెరీర్‌ను హిందుస్థాన్ యూనిలీవర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ప్రారంభించారు. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డాయిచ్ టెలికాం వంటి అంతర్జాతీయ సంస్థల్లో కీలక పదవుల్లో పనిచేశారు. టీ-మొబైల్‌లో ఆయన టెక్నాలజీ, కస్టమర్, బిజినెస్ విభాగాలను పర్యవేక్షించారు.
మోల్సన్ కూయర్స్ సీఈవోగా రాహుల్ గోయల్
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పానీయాల సంస్థ మోల్సన్ కూయర్స్ కు కొత్త ప్రెసిడెంట్ , సీఈవోగా రాహుల్ గోయల్ నియమితులయ్యారు. షికాగో కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 24 ఏళ్లుగా కంపెనీతో ఉన్న గావిన్ హాట్‌సర్లే తర్వాత ఈ పదవికి గోయల్ వారసుడిగా వస్తున్నారు.
మైసూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుని, డెన్వర్‌లో మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసిన గోయల్, గతంలో కూయర్స్ , మోల్సన్ బ్రాండ్‌ల కోసం అమెరికా, యుకె , భారతదేశంలో పనిచేశారు. "సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను, కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను" అని ఆయన పేర్కొన్నారు.
*భారతీయ ప్రతిభకు దర్పణం
అమెరికాలో కొంతమంది "విదేశీ ఉద్యోగులు స్థానిక ఉద్యోగ అవకాశాలను లాక్కుంటున్నారు" అని వాదిస్తున్నప్పటికీ, భారతీయ మూలాలున్న నాయకులు తమ నాయకత్వ సామర్థ్యాలను నిరూపించుకుంటూ ప్రముఖ సంస్థలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయిలో భారతీయ ప్రతిభకు లభిస్తున్న గుర్తింపునకు నిదర్శనం.
