అమెరికాలో ఉద్యోగాల్లో వివక్షకు లోనవుతున్న ఎన్ఆర్ఐలు!
ఒకప్పుడు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులు, ప్రస్తుతం అక్కడ వివిధ రకాల అనుభవాలను ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 1 July 2025 9:33 AM ISTఒకప్పుడు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులు, ప్రస్తుతం అక్కడ వివిధ రకాల అనుభవాలను ఎదుర్కొంటున్నారు. బలవంతపు నిర్బంధాలు, అరెస్టులు మాత్రమే కాకుండా... ఇప్పుడు ఉద్యోగాల పరిధిలోనూ తాము అనుభవిస్తున్న వివక్షపై పలువురు ఎన్ఆర్ఐలు గొంతును వినిపిస్తున్నారు.
- భాష యాసపై వివక్ష: సమావేశాల్లో మాట్లాడవద్దని సూచన!
ఓ భారతీయ ఉద్యోగి రెడిట్‌లో తన బాధను వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. 32 ఏళ్ల అతను గత సంవత్సరం నుంచి అమెరికాలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని జట్టులో సభ్యులందరూ అమెరికన్లే. ఒకసారి ప్రాజెక్ట్ అప్‌డేట్ గురించి 55 ఏళ్ల సహచరుడిని అడిగినప్పుడు అతను "మీరు మీ యాక్సెంట్ వల్ల ఏమీ అర్థం కావట్లేదు. మీరేం మాట్లాడకండి" అని అన్నాడట. ఇది తనను అవమానపరిచేలా ఉందని, ఇప్పటివరకు తనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. ఈ ఘటన ఆన్‌లైన్‌లో విస్తృతంగా చర్చించబడింది. కార్యాలయాల్లో వివిధ భాషలు, ఉచ్చారణలు, సంస్కృతుల పట్ల ఉండాల్సిన గౌరవం గురించి తీవ్రమైన చర్చకు దారితీసింది.
- వెజిటేరియన్ అంటే మనుషులే కాదట?.. ఆకలితో ఆవేదన
ఇంకో ఘటనలో శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్న భారతీయ మహిళ రుంఝున్ మిశ్రా కార్యాలయ భోజన వేడుకలో తన ఆహార అభిరుచులకు గౌరవం లేకుండా ప్రవర్తించారని వాపోయింది. "ది విక్డ్ వెజిటేరియన్" పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆమె ఆఫీసు నుంచి లంచ్ ఇచ్చే రోజు వెళితే 60 రకాల శాండ్‌విచ్‌లు ఉన్నా ఒక్క వెజిటేరియన్ ఐటమ్ కూడా లేకపోయిందని తెలిపింది. తాను అడిగినప్పుడు మాంసాన్ని తొలగించుకుని బ్రెడ్ మాత్రమే తినమని సూచించారట! ఇది తనను తీవ్రంగా బాధించిందని, అమెరికాలో వెజిటేరియన్లకు ఈ స్థాయిలో అన్యాయం జరుగుతోందని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వివరించింది. ఆమె భావోద్వేగాలకు అనేకమంది భారతీయ నెటిజన్లు మద్దతుగా నిలిచారు.
- ఒకే భూమి, రెండు ప్రమాణాలా?
ఈ రెండు ఘటనలు ఎన్ఆర్ఐలలో ఒకింత అవమానాన్ని, ఒకింత ఆవేదనను కలిగిస్తున్నాయి. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తూ, తమ విలువలను నిలబెట్టుకునే ఎన్ఆర్ఐలకు ఇంకా కూడా పూర్తి ఉద్యోగ స్వేచ్ఛ లేకపోవడం విచారకరం. తమ ఉచ్చారణ, ఆహార అలవాట్లు వంటి అంశాలపై విమర్శలు చేయడం వలస వెళ్ళిన భారతీయులకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోంది.
ఇప్పటివరకు ఎన్నో అవకాశాల కోసం అమెరికా వెళ్ళిన ఎన్నారైలకీ, ప్రస్తుతం అవమానాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో... అక్కడ జీవితం నిజంగా అంత సులభమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు స్వప్నాల దేశంగా కనిపించిన అమెరికా... ఇప్పుడు చాలామందికి కష్టాల గమ్యస్థానంగా మారిందా?