Begin typing your search above and press return to search.

మిస్సింగ్ నుంచి మృతదేహం వరకు: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి విషాదాంతం

11వ తరగతి చదువుతున్న గౌతమ్ గత శనివారం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   17 March 2026 1:16 PM IST
మిస్సింగ్ నుంచి మృతదేహం వరకు: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి విషాదాంతం
X

అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు కనిపించకుండా పోవడం.. అనంతరం మృతదేహాలుగా బయటపడటం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, పిట్స్‌బర్గ్ సమీపంలోని సౌత్ ఫయేట్ ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల భారతీయ మూలాల విద్యార్థి గౌతమ్ రాజా రాజనీకాంత్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. 11వ తరగతి చదువుతున్న గౌతమ్ గత శనివారం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. అతను ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

గౌతమ్ కనిపించకుండా పోయిన విషయాన్ని అతని తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సౌత్ ఫయేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ గాలింపు చర్యలను ప్రారంభించింది. పరిసర ప్రాంతాలను విస్తృతంగా తనిఖీ చేస్తూ అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించింది. డ్రోన్లు, శునక దళాలు సహా అన్ని విధాలుగా అన్వేషణ చేపట్టారు.

దురదృష్టవశాత్తూ రెండు రోజుల గాలింపు అనంతరం సోమవారం గౌతమ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతను ఎక్కడ, ఎలా మృతి చెందాడు అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఘటనకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగినదా, లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.

గౌతమ్ మృతి వార్త తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే, మితభాషి, స్నేహపూర్వక స్వభావం కలిగిన బాలుడిగా గౌతమ్‌కు మంచి పేరుంది. అతని అకస్మాత్తు మృతి అందరినీ శోకసంద్రంలో ముంచేసింది.

ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న అనూహ్య ఘటనలు భారతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా అంశాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం సమర్థవంతమైన భద్రతా వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సహాయ సేవలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

గౌతమ్ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, నిజానిజాలు వెల్లడించాలని భారతీయ సమాజం కోరుతోంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం కలగాలని అందరూ ప్రార్థిస్తున్నారు.