Begin typing your search above and press return to search.

భారతీయులపై అమెరికన్ల విమర్శలు భావోద్వేగమా.. అసూయనా?

అమెరికా రాజకీయ వాతావరణం ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సీజన్ దగ్గరపడే కొద్దీ, వలసలు, ఉద్యోగాలు, వాణిజ్య విధానాలపై చర్చలు మరింత వేడెక్కుతాయి

By:  Tupaki Desk   |   5 Sept 2025 7:00 PM IST
భారతీయులపై  అమెరికన్ల విమర్శలు భావోద్వేగమా.. అసూయనా?
X

అమెరికా రాజకీయ వాతావరణం ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సీజన్ దగ్గరపడే కొద్దీ, వలసలు, ఉద్యోగాలు, వాణిజ్య విధానాలపై చర్చలు మరింత వేడెక్కుతాయి. తాజాగా భారతీయులపై అమెరికన్ రైట్-వింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ‘‘భారతీయుల వల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం’’ అన్న ఆరోపణలు కేవలం ఆగ్రహపూరితమైనవా ? లేక వాస్తవానికి ఆధారమా? అన్నదానిపై విశ్లేషణ అవసరం ఉంది.

ట్రంప్ విధానాల ప్రభావం

ఇండియాపై అధిక సుంకాలు విధించడం, వీసాల మంజూరులో ఆంక్షలు వంటి నిర్ణయాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. భారత్, రష్యా, చైనా దేశాలతో దగ్గరగా ఉంటున్నదన్న అభిప్రాయం అమెరికాలోని ఓ వర్గాన్ని మరింత ఆందోళనకు గురి చేసింది. ఈ అసంతృప్తి ఇన్‌ఫ్లూయెన్సర్ల వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తోంది.

ఇన్‌ఫ్లూయెన్సర్ల విమర్శలు

‘భారత్‌తో ఏ ఒప్పందం కుదుర్చుకున్నా, మరిన్ని వీసాలు ఇవ్వాల్సిందే. ఇది అమెరికాకు నష్టమని’’ కామెంటేటర్ లారా ఇంగ్రహమ్ వ్యాఖ్యానించారు. ‘‘భారతీయుల వల్లే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు’’ అని చార్లీ కిర్క్ ఆరోపించారు. జాక్ పోసోబియెక్ అయితే, ‘‘కాల్ సెంటర్లపై 100% టారిఫ్స్ వేయాలి’’ అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ఇవన్నీ అమెరికాలోని రైట్-వింగ్ వర్గాలు తమ అసంతృప్తిని వలసదారులపైకి మళ్లిస్తున్న సంకేతాలుగా భావించవచ్చు.

వాస్తవ పరిస్థితి

అమెరికాలో టెక్ , ఐటీ పరిశ్రమలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. హెచ్-1బీ వీసాదారుల్లో 75 శాతం మంది భారతీయులే. అంతేకాదు, అమెరికా విశ్వవిద్యాలయాల్లో 2 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అంటే, భారతీయులు అక్కడ ఉద్యోగాలు లాక్కోవడం కాకుండా, ఆర్థిక వ్యవస్థకు, ఇన్నోవేషన్‌కి తోడ్పడుతున్నారు. పత్రికా రచయిత బిల్లీ బినియన్ చెప్పినట్లుగానే, ఇది అసూయతో కూడిన ప్రతిస్పందన మాత్రమే. కష్టపడి ముందుకు వెళ్తున్న భారతీయులను పోటీగా కాకుండా ప్రమాదంగా చూస్తున్నారు.

భారతీయ అమెరికన్ల ఆవేదన

ఈ వ్యాఖ్యలు అక్కడి భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలిచివేశాయి. ఇంతకుముందు రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చిన వర్గాలు కూడా ఇప్పుడు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ‘‘మేము మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు మాపై ద్వేషం చూపిస్తున్నారు’’ అన్న భావన పెరుగుతోంది. ఇది అమెరికా రాజకీయాల్లో వలసదారుల ఓటు బ్యాంకుపై కొత్త ప్రభావం చూపే అవకాశం ఉంది.

భావోద్వేగమా..వాస్తవమా?

మొత్తానికి, అమెరికాలో కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తున్న వ్యాఖ్యలు భావోద్వేగంతో కూడుకున్నవే తప్ప వాస్తవానికి దగ్గరగా లేవు. భారతీయులు ఉద్యోగాలను కాజేయడం కాకుండా, కొత్త అవకాశాలు సృష్టిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. కానీ రాజకీయ అవసరాల కోసం వలసదారులపై ద్వేషం రెచ్చగొట్టడం అక్కడ సాధారణ వ్యూహంగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఈ అంశం మరింత ముద్ర వేసే అవకాశం ఉంది.