అమెరికాలో 8 మంది భారత యువకుల అరెస్టు.. ఏం చేశారో తెలుసా?
ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో అధికారంగా అమెరికాకు వెళ్తుంటారు చాలా మంది భారతీయులు.
By: Tupaki Desk | 13 July 2025 12:39 PM ISTఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో అధికారంగా అమెరికాకు వెళ్తుంటారు చాలా మంది భారతీయులు. అయితే... వీరిలో కొంతమంది చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తుంటారు. వారిని ట్రంప్ వచ్చిన తర్వాత వెనక్కి పంపేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. ఇలానే అక్రమంగా అమెరికాలో ప్రవేశించి నేరాలకు పాల్పడుతున్న బ్యాచ్ ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
అవును... అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించడంతో పాటు అక్కడ నేరాలు, ఘోరాలకు పాల్పడుతోన్న ఎనిమిది మంది భారత సంతతి యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ హింస, కిడ్నాప్ కేసుల్లో అరెస్టు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వీరందరికీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
అరెస్టయిన వారిలో ఎన్ఐఏ వెతుకుతున్న పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా కూడా ఉన్నాడు. అతడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురిని దిల్ ప్రీత్ సింగ్, అర్ష్ ప్రీత్ సింగ్, అమృత్ పాల్ సింగ్, గుర్తజ్ సింగ్, సరబ్ జిత్ సింగ్, మన్ ప్రీత్ రాంధావా, విశాల్ గా గుర్తించారు.
ఇటీవల కొంతమంది బెదిరింపులు, హింసకు పాల్పడుతున్నారంటూ కాలిఫోర్నియాలో వరుస ఫిర్యాదు వచ్చాయని చెబుతున్నారు. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరంతా అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఆ సమయంలో ఆ ఎనిమిది మంది నిందితుల నివాసాలపై దాడులు చేయగా వీరి నుంచి ఎఫ్.బీ.ఐ. అధికారులు... 5 హ్యాండ్ గన్ లు, ఒక అస్సాల్ట్ రైఫిల్, వందలాది రౌండ్ల మందుగుండు సామగ్రి, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్ లు, 15000 యూఎస్ డాలర్లు నగదును స్వాధీనం చేసుకుందని చెబుతున్నారు.
దీంతో వారిపై ఆయుధాలకు సంబంధించిన అదనపు అభియోగాలు మోపబడ్డాయి. వీరిపై భారత్ లోనూ పలు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో... భారత్ లోని ఎన్‌ఐఏ అధికారులతో అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నామని అన్నారు. భారతదేశంలో చట్టపరమైన చర్యలు, శిక్షలను తప్పించుకోవడానికి ఈ గ్యాంగ్ స్టర్లు అమెరికాకు పారిపోయినట్లు చెబుతున్నారు.
