నిజం చెప్పినందుకు 40 సెకన్లలో భారతీయుడి అమెరికా వీసా తిరస్కరణ
అమెరికా వెళ్లాలని కలలు కంటున్న ఓ భారతీయుడి ఆశ నిమిషాల్లోనే ఆవిరైంది. వీసా ఇంటర్వ్యూలో అతడు చెప్పిన ఒకే ఒక్క సమాధానం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 17 April 2025 2:37 PM ISTఅమెరికా వెళ్లాలని కలలు కంటున్న ఓ భారతీయుడి ఆశ నిమిషాల్లోనే ఆవిరైంది. వీసా ఇంటర్వ్యూలో అతడు చెప్పిన ఒకే ఒక్క సమాధానం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. కేవలం 40 సెకన్లలోనే అతడి వీసా దరఖాస్తును తిరస్కరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడు తన ఆవేదనను వెళ్లగక్కాడు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
‘nobody01810’ అనే రెడిట్ యూజర్ తన బాధను ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తాను ఇటీవల బీ1/బీ2 వీసా కోసం యూఎస్ ఎంబసీకి వెళ్లానని తెలిపాడు. అక్కడ తనను కేవలం మూడు ప్రశ్నలు మాత్రమే అడిగారని, నిమిషం తిరిగేలోపే తన వీసాను తిరస్కరించారని వాపోయాడు. అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు భారత్ వెలుపల ఎప్పుడైనా పర్యటించారా? అమెరికాలో మీకు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అని అధికారులు ప్రశ్నించారట.
ఈ ప్రశ్నలకు ఆ వ్యక్తి నిజాయితీగా సమాధానం చెప్పాడు. "నేను రెండు వారాల పాటు వెకేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను భారత్ దాటి ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్లోరిడాలో నాకు ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది" అని బదులిచ్చాడు. అయితే, ఆ వ్యక్తి సమాధానాలు యూఎస్ ఎంబసీ అధికారికి నచ్చలేదని తెలుస్తోంది. అతడు వీసాకు అర్హుడు కాదని చెబుతూ తిరస్కరణ పత్రాన్ని అతడి చేతిలో పెట్టారు.
తాను కేవలం పర్యటన కోసమే అమెరికా వెళ్లాలనుకున్నానని, తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం అనేది ఒక అదనపు అవకాశం మాత్రమేనని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. తాను కేవలం రెండు వారాలు మాత్రమే అక్కడ ఉండి తిరిగి భారత్‌కు వచ్చేస్తానని చెప్పినా అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించడం అతడికి బాధ కలిగించింది. వీసా ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది "మీరు మీ గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పడం వల్లే మీ వీసాను తిరస్కరించారు. మీరు ఆమె సహాయంతో అమెరికాలో అక్రమంగా ఉండిపోతారని వారు భయపడి ఉంటారు" అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పినా వీసా తిరస్కరించడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు.
