Begin typing your search above and press return to search.

7,000 మంది విషయంలో హార్వర్డ్ కీలక నిర్ణయం.. ట్రంప్ కు బిగ్ స్ట్రోక్!

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 May 2025 8:02 PM IST
7,000 మంది విషయంలో హార్వర్డ్  కీలక నిర్ణయం.. ట్రంప్  కు బిగ్  స్ట్రోక్!
X

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు! దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి! ఈ సమయంలో రివర్స్ లో ట్రంప్ కు షాకిచ్చింది హార్వర్డ్ వర్సిటీ.

అవును... అంతర్జాతీయ విద్యార్థుల చేర్చుకునే సంస్థ సామర్థ్యాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ట్రంప్ పరిపాలపై దావా వేసింది. ట్రంప్ తీసుకొన్న తాజాగా నిర్ణయాన్ని అమెరికా రాజ్యాంగంతో పాటు ఇతర చట్టాలపైనా స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించింది.

విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేయడంతో 7,000 మందికి పైగా వీసాదారులపై తక్షణ, వినాశకరమైన ప్రభావాన్ని చూపిందని హార్వర్డ్ వర్సిటీ బోస్టన్ ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఒక కలం పోటుతో హార్వర్డ్ వర్సిటీలోని నాలుగో వంతును.. దాని లక్ష్యానికి గణనీయంగా దోహదపడే అంతర్జాతీయ విద్యార్థులను తుడిచిపెట్టడానికి ప్రయత్నించిందని తన ఫిర్యాదులో పేర్కోంది.

ఈ చట్టవిరుద్ధమైన చర్యను తాము ఖడిస్తున్నామని.. ఇది హార్వర్డ్ అంతటా వేలాది మంది విద్యార్థులు, ప్రొఫెసర్ ల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని.. అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి వచ్చిన చాలా మంది ఇతరులకు ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుందని ఓ నోట్ లో పేర్కొంది. తన విదేశీ విద్యార్థుల కోసం హార్వర్డ్ తన శక్తిమేరకు ప్రతీదీ చేస్తుందని ప్రతిజ్ఞ చేసింది.

కాగా... హార్వర్డ్ విషయంలో ట్రంప్ సర్కార్ తీసుకొన్న తాజా నిర్ణయంతో సుమారు 7,000 మంది విదేశీ విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో 27%గా ఉన్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 7,000 మంది భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరుతూ ట్రంప్ పై దావా వేసింది హార్వర్డ్!

హార్వర్డ్ యూనివర్సిటీలోని సుమారు 7,000 విదేశీ విద్యార్థుల్లో దాదాపు 788 మంది భారతీయ విద్యార్థులు. ఈ క్రమంలో తాజా ట్రంప్ నిర్ణయంతో వీరందరి భవితవ్యం గందరగోళంలో పడింది.