తాగి నడిపాడు.. H-1B వీసాకు ఎసరు తెచ్చుకున్నాడు.. ఓ టెకీ వ్యథ
అమెరికాలో ఉన్న H-1B వీసాదారులకు చిన్నపాటి పొరపాటు కూడా జీవితకాలం భారంగా మారవచ్చు.
By: Tupaki Desk | 14 Jun 2025 5:00 PM ISTఅమెరికాలో ఉన్న H-1B వీసాదారులకు చిన్నపాటి పొరపాటు కూడా జీవితకాలం భారంగా మారవచ్చు. ఎన్నో ఏళ్ల కష్టంతో సంపాదించుకున్న ఉద్యోగం, స్టేటస్ ఒక్క తప్పుతో నాశనం కావచ్చు. ఇటీవల ఒక భారతీయ H-1B వీసా హోల్డర్ తన హృదయ విదారక కథను పంచుకున్నాడు.
గత ఏడాది మద్యం మత్తులో వాహనం నడుపుతూ (DUI - Driving Under Influence) పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి కోర్టులో అప్పీల్ చేయడంతో అతనిపై మూడవ శ్రేణి ఇన్‌ఫ్రాక్షన్‌గా కేసు తక్కువ శిక్షతో ముగిసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ప్రస్తుతం అతను తన H-1B వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోగా, USCIS నుంచి 'RFE' (Request For Evidence) నోటీసు వచ్చింది. USCIS వారు ఏమి అడగబోతున్నారో తెలియక అతను తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఎందుకంటే అమెరికాలో DUI విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కసారి ఈ రికార్డులో పడిపోతే జీవితాంతం ఆ మరక వెంటాడుతుంది.
ఈ సంఘటన కేవలం అతని ఒక్కడిదే కాదు. చాలా మంది H-1B వీసా హోల్డర్లు తమ ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. DUI తర్వాత కొందరి వీసాలు తక్షణమే రద్దయ్యాయి. అదృష్టవశాత్తూ, కొన్ని సందర్భాల్లో ఆఫీసర్ల దయతో సమస్య నుండి బయటపడిన వారు కూడా ఉన్నారు. అయితే, ఇది పూర్తిగా ఆఫీసర్ల వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడటం అనేది చేదు నిజం.
ఈ సంఘటన ప్రతి H-1B వీసాదారునికి ఒక పెద్ద హెచ్చరిక. మద్యం మత్తులో డ్రైవింగ్ వంటి తప్పిదాలను పూర్తిగా నివారించవచ్చు. మీరు ప్రయాణించడానికి టాక్సీ తీసుకోవచ్చు లేదా స్నేహితుడిని సహాయం కోరవచ్చు. కానీ అలాంటి ఆలోచన లేకపోవడం, ఒకే ఒక్క పొరపాటు ఎన్నో ఏళ్ల కష్టాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తుంది.
అందుకే అమెరికాలో నివసిస్తున్న ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. "నిన్ను నువ్వు కాపాడుకో... నీ భవిష్యత్తును చిన్న తప్పిదాలతో పాడుచేసుకోకు."
