Begin typing your search above and press return to search.

హెచ్1బీ లాటరీ ముగింపు... వేలాది మంది కళ్లలో కన్నీళ్లు.. అమెరికా కల చెదిరిన వేళ!

ఈ ప్రకటనతో ఎంపికైన అభ్యర్థులలో ఆనందం వెల్లివిరుస్తుంటే ఎంపిక కాని వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

By:  A.N.Kumar   |   1 April 2026 4:38 PM IST
హెచ్1బీ  లాటరీ ముగింపు... వేలాది మంది కళ్లలో కన్నీళ్లు.. అమెరికా కల చెదిరిన వేళ!
X

అమెరికాలో కొలువు తీరాలని.. అక్కడి అత్యాధునిక జీవనశైలిని అందిపుచ్చుకోవాలని కలలుగనే లక్షలాది మంది విదేశీ ఐటీ నిపుణులకు హెచ్1బీ వీసా ఒక బంగారు బాట. ప్రతి ఏటా నిర్వహించే ఈ వీసా లాటరీ ప్రక్రియ ఈసారి కూడా ఉత్కంఠకు మరెంతో మంది నిరాశకు వేదికైంది. తాజాగా ఆర్థిక సంవత్సరం 2027 కు సంబంధించిన హెచ్1బీ ప్రారంభ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియ అధికారికంగా ముగిసిందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ప్రకటించడంతో ఈ ఏడాది లాటరీ అంకానికి తెరపడింది.

ఈ ప్రకటనతో ఎంపికైన అభ్యర్థులలో ఆనందం వెల్లివిరుస్తుంటే ఎంపిక కాని వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఎంపికైన వారు ఏప్రిల్ 1, 2026 నుంచి తమ పూర్తి స్థాయి పిటిషన్లను దాఖలు చేసుకునేందుకు వీలుంటుంది.

కొత్త విధానం.. అవే సవాళ్లు

ఈ ఏడాది లాటరీ ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే ఇది 'బెనిఫిషియరీ-సెంట్రిక్' లేదా వెయిటెడ్ లాటరీ విధానంలో పూర్తిస్థాయిలో నిర్వహించిన మొదటి చక్రం. గతంలో ఒక్కో అభ్యర్థి పేరుతో పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మోసాలకు తావుండేది. కానీ ఈసారి అభ్యర్థి పాస్‌పోర్ట్ ఆధారంగా కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు మార్చారు. వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఈ మార్పు చేసినప్పటికీ అభ్యర్థుల సంఖ్యకు, అందుబాటులో ఉన్న వీసాల కోటాకు సుమారు 85,000 మధ్య ఉన్న భారీ వ్యత్యాసం వల్ల పోటీ ఏమాత్రం తగ్గలేదు.

సోషల్ మీడియాలో భావోద్వేగాల వెల్లువ

లాటరీ ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికలు అభ్యర్థుల ఆవేదనతో నిండిపోయాయి. ముఖ్యంగా రెడిట్, లింక్డ్ ఇన్, ఎక్స్ వంటి వేదికల్లో నిరాశకు గురైన వారు తమ బాధను పంచుకుంటున్నారు. "నా జీవితంలో ఇంతగా ఎప్పుడూ ఏడవలేదు. నా ఆశలన్నీ ఈ లాటరీపైనే ఉన్నాయి. నా పరిస్థితి చూసి నా సహోద్యోగులు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం నన్ను మరింత కుంగదీసింది " అని ఒక అభ్యర్థి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇలాంటి హృదయవిదారక కథనాలు వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపీటీ కాలపరిమితి ముగిసిపోతున్న విద్యార్థులకు, ఇది చివరి అవకాశం కావడంతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అమెరికాలో స్థిరపడాలనే కల చెదిరిపోవడమే కాకుండా తీసుకున్న విద్యా రుణాలు, కెరీర్ ఎదుగుదలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనిశ్చితిలో భవిష్యత్తు

ఈ ఏడాది లాటరీ ప్రక్రియలో జరిగిన ఆలస్యం కూడా అభ్యర్థులపై మానసిక ఒత్తిడిని పెంచింది. ఫలితాల కోసం నెలల తరబడి వేచి చూడటం, ఆపై ప్రతికూల ఫలితం రావడంతో చాలా మంది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు ఈ లాటరీ విధానం వల్ల ప్రతి ఏటా ఒక రకమైన 'జూదం' ఆడుతున్నట్లు అనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు

ఎంపిక కాని అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. మరికొంత కాలం చదువుకుంటూ పని చేసేందుకు వీలు కల్పించే విశ్వవిద్యాలయాల్లో చేరడం...కెనడా లేదా ఇతర దేశాలకు వలస వెళ్లడం.. వీసా నిబంధనలు సరళంగా ఉన్న దేశాలకు వెళ్లడం వీరి ముందున్న ఆప్షన్. భారతదేశం వంటి దేశాల్లో ఐటీ రంగం పుంజుకుంటున్న నేపథ్యంలో, సొంత ఊరికి వెళ్లి కెరీర్ నిర్మించుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారు..

మొత్తానికి 2027 ఆర్థిక సంవత్సరానికి లాటరీ ప్రక్రియ ముగియడం అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన అంశం మాత్రమే కాదు.. ఇది వేలాది మంది యువత కలలు, ఆశలు భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. ఒక వైపు విజేతల సంబరాలు కనిపిస్తుంటే మరోవైపు నిరాశలో ఉన్న నిపుణులకు భరోసా ఇచ్చే వ్యవస్థ కావాలని మేధావులు కోరుతున్నారు.