Begin typing your search above and press return to search.

సీమాను గుర్తుకు తెచ్చే లవ్ స్టోరీ.. కాకుంటే కొత్త ట్విస్టు

ప్రేమ కోసం ఆరేళ్ల కూతురితో పోలాండ్ నుంచి జార్ఖండ్ కు!

By:  Tupaki Desk   |   20 July 2023 4:33 AM GMT
సీమాను గుర్తుకు తెచ్చే లవ్ స్టోరీ.. కాకుంటే కొత్త ట్విస్టు
X

ప్రేమకు హద్దులు.. సరిహద్దులు చెరిగిపోతున్నాయి. కొత్త తరహా ప్రేమకథలకు ఆన్ లైన్ వేదికగా మారుతోంది. గతానికి భిన్నమైన లవ్ స్టోరీలు తెర మీదకు వస్తున్నాయి. ఆన్ లైన్ స్నేహాలు.. సోషల్ మీడియా పరిచయాలు వేలాది కిలోమీటర్ల దూరంలోని విదేశీయులతో ప్రేమకథలు పుట్టుకు రావటమే కాదు.. కొత్త తరహా సన్నివేశాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ మధ్యనే పాకిస్థాన్ కు చెందిన సీమా అనే యువతి తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ కు రావటం.. ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అన్న సందేహాలు వ్యక్తం కావటం.. ఆమెను విచారించటం తెలిసిందే. ఈ సీమాంతర ప్రేమకథకు మరో లవ్ స్టోరీ తెర మీదకు వచ్చింది.

కాకుంటే సదరు మహిళ పోలాండ్ కు చెందిన పోలాక్ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. జాతీయ మీడియాలోనూ వీరి లవ్ స్టోరీకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. 49 ఏళ్ల (కొన్ని మీడియా సంస్థల్లో 45 ఏళ్లుగా ప్రస్తావిస్తున్నారు) పోలాక్ పోలాండ్ కు చెందిన మహిళ. ఆమెకు ఇప్పటికే పెళ్లై.. ఒక కుమార్తె ఉంది. ఆమెకు 2021లో ఇన్ స్టాలో జార్ఖండ్ కు చెందిన 35 ఏళ్ల మహ్మద్ షాదాబ్ పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ మధ్యనే భర్త నుంచి విడాకులు తీసుకున్న పోలాక్.. తన ఆరేళ్ల కుమార్తెను తీసుకొని జార్ఖండ్ కు చేరుకుంది.

జార్ఖండ్ లోని హజారీ బాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన ఇతగాడిని కలుసుకుంది. కొన్ని రోజుల పాటు హోటల్ లో బస చేసిన ఆమె.. ఆ తర్వాత షాదాబ్ ఇంటికి షిప్టు అయ్యారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఆమె.. రోజువారీ పనులను కూడా చేస్తుండటం విశేషం. పశువుల పేడ ఎత్తటం దగ్గర నుంచి అన్ని పనులను చేస్తున్న ఆమె.. చుట్టుపక్కల వారికి వింతగా మారారు. ఆమెను చూసేందుకు రోజు పెద్ద ఎత్తున గ్రామస్థులు షాదాబ్ ఇంటికి వస్తున్నారు.

పోలాండ్ మహిళ విషయం పోలీసులకు చేరటం.. ఈ మధ్యనే పాక్ కు చెందిన సీమా ఎపిసోడ్ నేపథ్యంలో హజారీ బాగ్ డీఎస్పీ రాజీవ్ కుమార్ ఖుత్రా గ్రామానికి వెళ్లి పోలాండ్ మహిళను కలిశారు. ఆమె తన పాస్ పోర్టు.. వీసా చూపించారు. భారత్ లో టూరిస్టు వీసా మీద ఉండేందుకు ఆమెకు 2027 వరకు అనుమతులు ఉన్నాయి. అయితే.. తాను మరికొద్ది రోజుల్లో తన దేశానికి వెళ్లిపోతానని.. షాదాబ్ ను తమ దేశానికి తీసుకెళ్లేందుకు అవసరమైన వీసా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని డీఎస్పీ చెబుతూ.. ‘‘షాదాబ్ కు పోలాండ్ వీసా వచ్చేశాక ఆమె అతడ్ని తన దేశానికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.