గ్రీన్‌కార్డ్ కోసం 'దోపిడీ' నాటకం: అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్
అమెరికా కల సాకారం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కిన 11 మంది భారతీయుల ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
By: A.N.Kumar | 14 March 2026 3:30 PM ISTఅమెరికా కల సాకారం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కిన 11 మంది భారతీయుల ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హింసాత్మక నేరాలకు గురైన బాధితులకు ఇచ్చే ‘యూ-వీసా’ పొందేందుకు వీరు సృష్టించిన ‘దోపిడీ నాటకాలు’ విఫలమై చివరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీఐ) చేతికి చిక్కారు. మసాచుసెట్స్, కెంటకీ, ఒహాయో, మిస్సోరి వంటి పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు ఈ వ్యవస్థీకృత ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఏమిటీ యూ-వీసా కుట్ర?
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం.. ఏదైనా తీవ్రమైన హింసాత్మక నేరానికి ఉదాహరణకు దోపిడీ, హత్యాయత్నం, వేధింపులు బాధితులుగా మారిన విదేశీయులకు ప్రభుత్వం 'యూ' నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కల్పిస్తుంది. ఈ వీసా పొందిన వారికి అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే అనుమతి లభించడమే కాకుండా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో శాశ్వత నివాస హోదా పొందే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకున్న నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నేరాలను సృష్టించారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, గ్యాస్ స్టేషన్ల వద్ద దోపిడీ జరిగినట్లు నాటకమాడేవారు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయుధాలతో బెదిరించినట్లు నటించడం, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తాము బాధితులమని రికార్డుల్లో ఎక్కించేవారు. ఈ పోలీస్ రిపోర్టుల ఆధారంగా 'యూ-వీసా' దరఖాస్తు చేసుకుని అమెరికాలో తిష్ట వేయాలని ప్లాన్ చేశారు.
బట్టబయలు చేసిన ఎఫ్‌బీఐ
బోస్టన్ కేంద్రంగా పనిచేసే 'వైలెంట్ క్రైమ్స్ టాస్క్ ఫోర్స్' ఈ అనుమానాస్పద దోపిడీ ఘటనలపై నిఘా పెట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన వరుస ఘటనల్లో బాధితులుగా ఉన్న వారి మధ్య సంబంధాలను విశ్లేషించిన అధికారులకు ఇది ఒక పెద్ద కుట్ర అని అర్థమైంది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను పరిశీలించగా వీరంతా వ్యవస్థీకృత మోసానికి పాల్పడుతున్నట్లు తేలింది.
అరెస్టయిన 11 మందిలో ఒకరిని ఇప్పటికే భారతదేశానికి డిపోర్ట్ చేయగా మరో ఆరుగురిని కోర్టు ముందు హాజరుపరిచి షరతులతో కూడిన విడుదల చేశారు. మిగిలిన నలుగురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
కఠిన శిక్షలు ఖాయం
అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తప్పుదోవ పట్టించినందుకు వీరిపై వీసా మోసం, కుట్ర, తప్పుడు ఫిర్యాదులు వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. "ఈ కేసులో నేరం నిరూపితమైతే నిందితులకు ఒక్కొక్కరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశం ఉంది." అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
అక్రమ మార్గం.. అనర్థదాయకం
ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం చట్టాలను దుర్వినియోగం చేస్తే అమెరికా భద్రతా సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ఇది నిరూపిస్తోంది. గ్రీన్‌కార్డ్ కోసం ఆరాటపడి జీవితాలను జైలు పాలు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
