శతాధిక సెలబ్రిటీ మరణానికి కారణమైన ఎన్ఆర్ఐ అరెస్టు!
ఆయన వయసు 114 ఏళ్లు. ఇదో విశేషమైతే.. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరు.
By: Tupaki Desk | 16 July 2025 4:43 PM ISTఆయన వయసు 114 ఏళ్లు. ఇదో విశేషమైతే.. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరు. కారణంగా అంత పెద్ద వయసులోనూ మారథాన్ అథ్లెట్ గా గుర్తింపు పొందిన భారతీయుడు ఫౌజా సింగ్. ఇంత పెద్ద వయసులోనూ ఆయన ప్రదర్శించే ఫిట్ నెస్ తో.. ఆయన్ను టర్బన్డ్ టోర్నడో’ను ముద్దుగా పిలుస్తుంటారు. అలాంటి పెద్ద మనిషి.. ఇటీవల రోడ్డు మీద నడుస్తున్న వేళలో.. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. ఆయన ప్రాణాల్ని తీసింది. దేశానికి మణిపూస లాంటి పెద్ద వయస్కుడ్ని కోల్పోయేలా చేసింది.
పంజాబ్ లోని జలంధర్ జిల్లాకు చెందిన ఆయన.. సాయంత్రం వేళ వాకింగ్ చేస్తుండగా వేగంగా ఆయన్ను ఢీ కొట్టి.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో గాల్లో ఎగిరి ఏడడుగుల దూరంలో పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద వయసు కారణంగా ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఈ పెద్ద మనిషి మరణానికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఫౌజా సింగ్ మరణం క్రీడా ప్రపంచంలో విషాదంగా మారటమే కాదు.. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తన సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రకటించారు. ప్రధాని మొదలు పలువురు ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ తో దర్యాప్తు చేపట్టారు. దీంతో.. ఆయన్ను ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించారు.
జలంధర్ కు చెందిన అమృత్ పాల్ ఈ హిట్ అండ్ రన్ కు కారణమని తేల్చారు. కెనడా నివాసి అయిన అతను.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఇండియాకు వచ్చాడు. తన సొంతపని మీద భోగ్ పుర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం తానేనని ఒప్పుకున్న అతను.. ఢీ కొట్టిన అనంతరం భయంతో తాను అక్కడి నుంచి పారిపోయినట్లుగా వెల్లడించారు. అతడిచ్చిన వివరాల నేపథ్యంలో అరెస్టు చేసిన పోలీసులు..కోర్టులో హజరుపర్చనున్నారు. ఒకరి నిర్లక్ష్య డ్రైవింగ్.. అతి వేగం దేశానికి ఆస్తి లాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన వైనం విషాదానికి గురి చేస్తోంది.
