Begin typing your search above and press return to search.

ఏం అమెరికా వీసా సామీ.. ఇన్ని కండీషన్లా?

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం సోషల్ మీడియా వెట్టింగ్ రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2025 11:14 PM IST
ఏం అమెరికా వీసా సామీ.. ఇన్ని కండీషన్లా?
X

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం సోషల్ మీడియా వెట్టింగ్ రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వీసా ప్రక్రియలో భాగంగా అమెరికా ఎంబసీలు అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. చిన్నపాటి తప్పులకు కూడా వీసా దరఖాస్తులను హోల్డ్‌లో పెడుతున్నాయి. ఇటీవల ఇలాంటి అనుభవాన్నే ఓ భారతీయ విద్యార్థి ఎదుర్కొన్నాడు. ఈ ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?

ఎఫ్-1 విద్యార్థి వీసా ఇంటర్వ్యూ కోసం ఇటీవల అమెరికా ఎంబసీకి వెళ్లిన ఓ భారతీయ విద్యార్థికి అనూహ్య ఘటన ఎదురైంది. తన రెడిట్ అకౌంట్ ను పబ్లిక్ యాక్సెస్ లో ఉంచినప్పటికీ, డీఎస్-160 ఫారంలో ఆ వివరాలను పేర్కొనలేదు. తన అకౌంట్‌లో ఎలాంటి హింసాత్మక లేదా అభ్యంతరకరమైన కంటెంట్ లేదని, అందుకే దాని వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ విద్యార్థి భావించాడు. అయితే, ఇంటర్వ్యూ చేసిన అధికారిణి రెడిట్ అకౌంట్ వివరాలు చూపలేదని పేర్కొంటూ విద్యార్థి వీసా దరఖాస్తును 221(g) నోటీసుతో హోల్డ్‌లో పెట్టారు. ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థి ఒక పోస్ట్ పెట్టాడు. "నా అకౌంట్ పబ్లిక్‌లో ఉంది, కానీ ఒక్కసారిగా సాంకేతిక కారణాలతో కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు వీసా ప్రక్రియను ఎలా నిలిపేస్తారు?" అని ప్రశ్నించాడు.

అమెరికా నిబంధనలు ఏం చెబుతున్నాయి?

అమెరికా ప్రభుత్వం ఇప్పటికే డీఎస్-160 వీసా దరఖాస్తుల్లో గత ఐదేళ్లలో ఉపయోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల యూజర్‌నేమ్‌లు, హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఖాతాలు ప్రైవేట్‌గా ఉన్నప్పటికీ, అవసరమైతే వాటిని పబ్లిక్ యాక్సెస్‌కి మార్చాల్సి ఉంటుంది.

-221(g) నోటీసు అంటే ఏమిటి?

221(g) నోటీసు అనేది అమెరికా వీసా ప్రక్రియలో అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కు సూచిక. దీని ద్వారా దరఖాస్తుదారుని వీసా ఆమోదాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ సమయంలో అభ్యర్థి నుంచి మరిన్ని డాక్యుమెంట్లు కోరే అవకాశం ఉంటుంది. అవసరమైన ధృవీకరణ పూర్తయ్యేంతవరకూ వీసా జారీ చేయరు.

ఇతర విద్యార్థులకు హెచ్చరిక

ఈ ఘటన అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రతి విద్యార్థికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. డీఎస్-160 ఫారమ్‌ను పూరించేటప్పుడు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాను కూడా విడిచిపెట్టకుండా, ఖచ్చితమైన , పూర్తి సమాచారాన్ని అందించడం అత్యవసరం. లేనిపక్షంలో వీసా ప్రక్రియ ఆలస్యం కావడమో లేదా తిరస్కరణకు గురవడమో జరగవచ్చు.

అమెరికాలో చదువు అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కల. చిన్నపాటి పొరపాట్లే వారికి పెద్ద ఆటంకంగా మారకుండా ఉండాలంటే, వీసా ప్రక్రియను జాగ్రత్తగా, నిబంధనలను పాటిస్తూ పూర్తి చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, సోషల్ మీడియా వివరాలను బహిర్గతం చేయడంలో ఎలాంటి అలసత్వం చూపకుండా ముందే స్పష్టంగా ఇవ్వాలి.