డాక్టర్ కుటుంబంలో విషాదం… ఆరియా మరణం వెనుక అసలు నిజం ఏంటి?
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఒక డాక్టర్, కన్న కూతురి మరణానికి కారణమైందనే వార్త అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
By: Madhu Reddy | 26 Feb 2026 10:53 PM ISTసమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఒక డాక్టర్, కన్న కూతురి మరణానికి కారణమైందనే వార్త అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో పడి తన బిడ్డ చనిపోయిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే, పోలీసులు జరిపిన విచారణలో వెలుగు చూసిన నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యనా?911 కాల్ రికార్డింగ్ నుండి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వరకు ఈ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆ 911 కాల్ వెనుక దాగున్న మిస్టరీ ఏంటి:
అమెరికాలోని ఓక్లహోమాలో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్న భారత సంతతి డాక్టర్ నేహా గుప్తా, గతేడాది తన నాలుగేళ్ల కుమార్తె ఆరియాతో కలిసి ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ ఒకరోజు ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి, తన కూతురు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిందని ఆందోళనగా చెప్పారు. "నాకు స్విమ్మింగ్ రాదు, నిద్రలో ఉండగా శబ్దం వినిపిస్తే లేచి చూశాను.. అప్పటికే నా బిడ్డ పూల్ అడుగున ఉంది" అంటూ ఆమె అధికారులకు వివరించారు. పోలీసులు వచ్చే వరకు పాపను కాపాడే ప్రయత్నం చేయమని సిబ్బంది సూచించినా, ఆమె తన వల్ల కాదేమో అని బదులిచ్చారు. తీరా సహాయక సిబ్బంది వచ్చి పాపను బయటకు తీసేసరికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు:
మొదట దీన్ని ప్రమాదంగా భావించినా, చిన్నారి శవపరీక్ష నివేదిక పోలీసులను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా నీటిలో మునిగి చనిపోయిన వారి ఊపిరితిత్తులు, కడుపులో నీరు చేరుతుంది. కానీ ఆరియా శరీరంలో అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు. అంటే ఆ పాప చనిపోయిన తర్వాతే ఎవరో నీటిలో పడేశారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఎవరో గొంతు నులిమి చంపడం వల్లే ఆ చిన్నారి మరణించిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది. దీంతో తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికే నేహా గుప్తా స్విమ్మింగ్ పూల్ డ్రామా ఆడారని పోలీసులు అనుమానిస్తూ ఆమెను అరెస్ట్ చేశారు.
తండ్రి ఆందోళన.. ముందే పసిగట్టిన ప్రమాదం!:
ఈ కేసులో మరో విషాదకరమైన కోణం ఏంటంటే.. ఆరియా తండ్రికి తన భార్య నేహా మానసిక స్థితిపై మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయి. ఇక ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని, పాపను తన కస్టడీకి ఇవ్వాలని ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక అయితే ఆయనకు తెలియకుండానే నేహా పాపను తీసుకుని ఫ్లోరిడాకు వెళ్లడం, అక్కడ ఈ ఘోరం జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా విచారిస్తున్నారు. కన్నతల్లే కాలయముడిలా మారిందా? లేక ఈ మరణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
